Monday, August 23, 2010

బ్యాంకులూ--గిమ్మిక్కులూ

వడ్డీ రేట్లు

మీకు గుర్తుండే వుంటుంది--క్రితం యేడాది దాదాపు ఇవే రోజుల్లో, తుమ్మల కిషోర్ లాంటివాళ్లు "సామాన్యుల నడ్డి విరుస్తున్న వడ్డీ రేట్లు" అంటూ ఆక్రోశించడం, అప్పుడు నేను వ్రాసిన టపాలూ!

ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి--మళ్లీ ఋణాలమీద వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి--అంటూ!

జూన్ 30 వరకూ వున్న ఋణాలకి పీ ఎల్ ఆర్, జూలై 1 నించి ఇచ్చినవాటికి బేస్ రేట్ వర్తిస్తుందంటున్నారు. ఇప్పటికే పీ ఎల్ ఆర్ లు పెంచేశారు, బేస్ రేట్ పెంచే ఆలోచన లో వున్నారు!

నిజం గా ఇదొక విషవలయం.

ద్రవ్యోల్బణం పెరుగుతోందని, ఎస్ ఎల్ ఆర్, సీ ఆర్ ఆర్, రెపో/రివర్స్ రెపో రేట్లు పెంచడం--ఈ రేట్లు పెరిగాయని, బ్యాంకుల తమ నిధిసేకరణ కోసం డిపాజిట్ల మీద వడ్డీరేట్లు పెంచడం, అవి పెరిగాయికాబట్టి ఋణాలమీద వడ్డీరేట్లు పెంచడం............ఇలా "పెరిగాయి, పెరిగాయి" అనడం, "తగ్గాయి, తగ్గాయి" అనడం!

నిజమే--ఋణాలమీద వడ్డీ రేట్లు నూటికి, సంవత్సరానికి, పావలా పెరిగినా, సామాన్యుడిమీద అది పైకి కనిపించని భారమే!

అదే డిపాజిట్లమీద పెరిగితే, కనపడేంత పెరుగుదలగానే కనిపిస్తుంది--ఇదీ సహజమే!

మరి మతలబేమిటంటే, ఋణాలమీద రేట్లు పెరిగితే, అవి మీరు ఓ పదిహేను యేళ్ల క్రితం తీసుకున్నవైనా, ఇంకో అయిదేళ్లలో గడువు ప్రకారం తీరిపోతుందనుకొని నిశ్చింతగా వున్నా, ఈ పెరుగుదల వల్ల--ఈ ఎం ఐ అయినా పెరుగుతుంది, లేదా గడువు తేదీ అయినా మారుతుంది!  

అదే డిపాజిట్ల మీద పెరిగిన రేట్లు--పాతవాటికి వర్తించవు--కొత్తవాటికి మాత్రమే! ఓ చిన్న వెసులుబాటేమిటంటే, పాత డిపాజిట్లని యెక్కువ వడ్డీ రేటు కోసం ఇవాళ రద్దు చేసుకొని, మళ్లీ కొత్తగా డిపాజిట్ చేసినట్టు వ్రాయించుకున్నా, నిన్నటివరకూ ఇంతకుముందు ఒప్పుకొన్న రేటు ప్రకారం వడ్డీని యెలాంటి మినహాయింపులూ లేకుండా చెల్లిస్తారు. 

కానీ, ఆ పెరుగుదల జరిగిన రోజునించీ ఒక్కరోజు ఆలస్యం గా బ్యాంకుకి వెళ్లినా, నష్టమే!

వుదాహరణకి, రేట్లు 16-08-2010 నించి పెరిగాయనుకోండి, మీరు 23 న వెళ్లి, మీ డిపాజిట్ ని కొత్తగా వ్రాయించుకున్నారనుకోండి, మీకు 7 రోజుల వడ్డీ పాత రేటు ప్రకారమే వస్తుంది! పైగా, ఇవాళనించీ వాళ్ల స్కీము ప్రకారం--ఓ యేడాది అనుకుందాం--గడువు తేదీ కూడా 7 రోజులు ముందుకు పోతుంది!

(ఇక ఋణ వితరణ, 'కాసా'లు, 'అల్కో'లు లాంటి వాటి గురించి మరోసారి)  

No comments: