Monday, July 19, 2010

సినీపరిశ్రమ

పైరసీ

సినిమాలు తియ్యడం దగ్గరనించి, ప్రజలకి వాటిని చూపించి, డబ్బులు చేసుకోవడం వరకూ 'పరిశ్రమ' అని వొప్పుకుంటే, మిగిలిన భాషల సినిమాల మాట నాకు తెలియదు గానీ, తెలుగు సినిమాలకు ఇది వర్తిస్తుందా అని నాకు సందేహం.

ఈ విషయాన్ని బాబూ మోహన్, మోహన్ బాబు లాంటివాళ్ళు చక్కగా చెప్పగలరు.

కావేరీ జలాల గురించి తమిళ సినీ పరిశ్రమ అంతా కదిలి వెళ్ళింది.

కర్ణాటక లో, ఖచ్చితం గా కన్నడ సినిమాలే ప్రదర్శించాలనీ, యెక్కడైనా ఖాళీ వుంటేనే మిగిలిన భాషా చిత్రాలు ప్రదర్శించుకోవచ్చనీ, కట్టడి చేసి, అమలు చేస్తున్నారు.

మళయాళం గురించి నాకు తెలియదు. యెందుకంటే, ఈ భాషల వాళ్ళు తమ చిత్రాలని అక్కడ విడుదల చేసి ప్రదర్శించగలరనుకోను.

ఇక పైరసీ విషయానికి వస్తే, అది 'ఆర్గనైజ్డ్ క్రైమ్' అని వొప్పుకోవాలి. గొప్ప గొప్ప దేశ ప్రభుత్వాలే మాఫియా లాంటివాటినీ, డ్రగ్స్ నీ యేమీ చెయ్యలేకపోతున్నారంటే, మన ప్రభుత్వాల సంగతి చెప్పఖ్ఖర్లేదు.

ఇక వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న పెద్ద హీరోల సినిమాలు పైరసీ వల్ల యెక్కువ నష్టపోతున్నాయి అని కొంతమంది బాధ పడుతున్నారు.

నిజమే--కానీ వాళ్ళు చేసేదీ వ్యాపారమే కదా? పెద్ద హీరోల సినిమాలకి పబ్లిసిటీకి, ప్రమోస్ కి, జనాల్లో ఎక్స్ పెక్టేషన్ లని పెంచడానికి యంత ఖర్చు పెడుతున్నారో అందరూ వూహించగలరు. ఇదే వాళ్ళ కొంప ముంచుతోంది.

విడుదలయిన రోజో, ఆ మర్నాడో తమ అభిమాన హీరో సినిమాని కేవలం "పది రూపాయల" ఖర్చు తోనే చూడగలుగుతున్నారు. అందుకే వాటికోసం యెగబడుతున్నారు--వందలు ఖర్చుపెట్టి థియేటరుకి వెళ్ళి చూడలేని సామాన్యులు.

చిన్న బడ్జెట్ సినిమాలకి సీడీలు వెంటనే విడుదల అవకపోయినా యేమీ ఫరవాలేదు--దొరికినప్పుడే చూస్తారు--లేదా, టీవీలూ, కేబుల్ టీవీలూ వుండనే వున్నాయి--పదిరూపాయల ఖర్చు కూడా లేకుండా చూడవచ్చు.

ఆ మధ్య టీవీల్లో కథనాలు వచ్చాయి పైరసీ యెలా జరుగుతోంది? అనే విషయం లో--కొంతవరకూ అన్నీ నిజాలే.

సినిమా టైటిల్, దాని డిజైన్ ఖరారవ్వగానే, అది పైరసీవాళ్ళకి చేరి పోతోంది. స్టిల్ ఫోటోలు పబ్లిసిటీ కోసం తియ్యబడగానే, అవి పైరసీవాళ్ళకి చేరుతున్నాయి. ఇక వాళ్ళు సీడీల కవర్ డిజైన్లని రూపొందించుకొని, ప్రింటు చేసేసి, సిధ్ధం గా వుంటున్నారు.

సినిమా విడుదల అయి, మొదటి ఆట ప్రదర్శించబడగానే, ఓ గంటలోపే సినిమా వీడియో మొత్తం కంప్యూటర్లో అప్ లోడ్ అయిపోయి, వెంటనే 50 నించి 80 వేల సీడీలు తయారయ్యి, మర్నాడు పొద్దున్నకల్లా, మన నగరాలూ పట్టణాల్లోని షాపులకీ, లైబ్రరీలకీ చేరుతున్నాయి.

ఈ అప్ లోడ్ అయిన సినిమాలని సీడీల్లో కాపీ చెయ్యడం అనేది చెన్నై, బెంగుళూరుల్లో జరుగుతున్నాయేమోనని టీవీవాళ్ళ సందేహం.

అంత ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న వ్యవహారాన్ని అరికట్టడం ప్రభుత్వం చేతుల్లో వుందా?

కొంతమంది, ఫలానా సినిమా పైరసీ సీడీలు మార్కెట్లోకి రాకుండా జాగ్రత్త పడ్డారు--మిగిలిన వాళ్లు కూడా ఆ రహస్యం తెలుసుకోండి--అని అంటున్నారు.

పబ్లిసిటీకి కొన్ని కోట్లు ఖర్చుపెట్టగలిగినవాళ్ళకి, హైదరాబాదు, విజయవాడల్లో, మిగిలిన పెద్ద పట్టణాల్లో యే థియేటరు నించి విడియో తియ్యబడుతోందో నిఘా పెట్టడం ఓ లెఖ్ఖా? (కానీ ఈ పని జరగడం లేదు--యెందుకో వూహించండి)

ఇక మహేష్ బాబులూ, పవన్ కల్యాణ్ లూ--నిజజీవిత హీరోలుగామారినట్టు నటించి, అభిమానులని వెంటేసుకెళ్ళి, షాపులని ధ్వంసం చెయ్యడం, వాళ్ళని చితక తన్నడం అనేవి కూడా పబ్లిసిటీ స్టంట్లే అని తెలియడం లేదూ?

అప్పుడప్పుడూ ముఖ్య మంత్రి కి విన్నపాలు ఇవ్వడం, సభల్లో మొసలి కన్నీళ్ళు కార్చడం, కొంతమంది చేత పైరసీ సీడీలు చూడడానికి వ్యతిరేకం గా స్టేట్ మెంట్లు ఇప్పించడం లాంటి పనులు చేస్తూ జీవిస్తున్నారు పరిశ్రమ పెద్దలు.

ఇదంతా అర్థం కాని కొందరు పినాకొ లు--ఈ విషయం పై వ్యాఖ్యానించేవాళ్ళమీద అడ్డం గా విరుచుకు పడుతున్నారు. వీళ్ళు తెలుసుకోవలసిన విషయం యేమిటి అంటే, వీళ్ళెంతగా విరుచుకుపడతారో, అంత పొడుగ్గానూ వాళ్ళ ముక్కు పెరిగి పోతుందని.

సినీపారిశ్రామికులూ, బ్లాగరులూ, సర్వేజనాస్సుఖినో భవంతు!       

No comments: