Wednesday, July 7, 2010

వడ్డీ రేట్లు

బేస్ రేట్

తుమ్మల కిశోర్ కి యిప్పుడు వెలుగుతున్నట్టుంది--మొన్న "ఇన్నాళ్ళూ పీ ఎల్ ఆర్ మైనస్ 'ఇంత' పర్సెంట్" అని వ్యవహరించేవి బ్యాంకులు. ఇప్పుడు బేస్ రేట్ ప్లస్ 'ఇంత' పర్సెంట్ అని అంటాయి తప్పితే, పెద్ద మార్పేమీ వుండదు" అన్నట్టు వ్రాశాడు.

ఇది వరకు పీ ఎల్ ఆర్ కన్నా తక్కువకి ఋణాలిచ్చే బ్యాంకులు, ఇప్పుడు బేస్ రేట్ కన్నా తక్కువకి ఇవ్వలేవు--అని కూడా వ్రాశాడు.

(ఈ పీ ఎల్ ఆర్ విషయం లో బ్యాంకులు యెన్ని వెరయిటీలు ప్రవేశ పెట్టాయో ఇదివరకు టపాల్లో వ్రాశాను.)

మరదే--నీ యెడం చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెడతాను--అంటే!

దాదాపు 130 యేళ్ళక్రితం బ్రిటీషు వాళ్ళు ప్రవేశపెట్టిన "నెగోషియబుల్ ఇన్స్ ట్రుమెంట్స్ ఆక్ట్" క్రింద పనిచేసేవి మన దేశం లోని బ్యాంకులు. (ఇప్పుడా చట్టం ఒక్క విషయం లోనే--బ్యాంకులకి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవలు ప్రకటించడానికే--వుపయోగిస్తోంది! బ్యాంకులే కాదు, బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ సహితం ఈ చట్టాన్ని తుంగలో తొక్కేశారు ఇప్పుడు!)

ప్రామిసరీ నోట్ (ప్రో నోటు); చెక్కు; బిల్ ఆఫ్ ఎక్స్ ఛేంజ్--ఇవీ నెగోషియబుల్ ఇన్స్ ట్రుమెంట్ లు అంటే.

ప్రామిసరీ నోట్ అంటే బ్యాంకులు స్వల్పకాల ఋణాలు ఇవ్వడానికి వ్రాయించుకొనేవి--ఇవి 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుతాయి--యెవరు వ్రాసినా, యెవరు వ్రాయించుకున్నా.

చెక్కు అంటే--మనం బ్యాంకులో దాచుకున్న డబ్బుని మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వమని బ్యాంకుకి జారీచేసే అధికార పత్రం. దీని విషయం లో లక్షా తొంభై రూల్సు అవసరమయ్యాయి కాల క్రమం లో. కొన్ని లక్షల కేసులు నమోదు చెయ్యబడేవి, బడుతూనే వున్నాయి ఇప్పుడు కూడా.

ఇక, బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ అంటే, ప్రో నోటు కి వ్యతిరేకం--నువ్వు నాకు నేనడిగినప్పుడు లేదా ఫలానా తారీఖు కి ఇంత డబ్బు ఇవ్వాలి అని వ్రాసేవి. వీటిలో 'సైట్' బిల్లులు అంటే, దాన్ని యెవరిని వుద్దేశించి వ్రాయబడిందో వాళ్ళు 'అంగీకారం' తెలపాలి. దీనికి బ్యాంకులు మీడియేటర్లుగా వుండేవి. సైట్ అంటే, "నువ్వు అంగీకరించిన తరవాత ఇన్ని రోజులకి/నెలలకి ఆ డబ్బు నాకుగానీ, నా ఆర్డరు పొందినవారికి గానీ చెల్లించాలి" అని వ్రాసేవి. 

ఇక్కడ ఆ చట్టం అవసరం వచ్చేది--డ్యూ డేట్ (చెల్లించవలసిన తేదీ) యేది--అనే విషయం లో. సామాన్యం గా చట్టం ప్రకారం, అంగీకారం అయిన తరవాత, యెన్నిరోజులు/నెలలు అయితే అన్నీ లెఖ్ఖపెట్టి, దానికి మూడు రోజులు 'గ్రేస్' (వుదారం గా) కలిపి, డ్యూ డేట్ నిర్ణయించాలి. ఒకవేళ, ఆ తేదీ గనక బ్యాంకుకి సెలవు అయితే, "అంతకు ముందు బ్యాంకు పనిచేసే రోజే" చెల్లింపు తేదీ గా మారుతుందన్నమాట!

అందుకనే, ఈ చట్టం క్రిందే, బ్యాంకులకి సెలవలు ప్రకటిస్తారు.

ఇలా "అంగీకృతమైన" బిల్లులని, బ్యాంకులు 10 శాతమో యెంతో తాము 'డిస్కవుంట్' గా స్వీకరించి, మిగిలిన సొమ్ము వ్రాసినవాడికి చెల్లించేసేవి--తాము డ్యూ డేట్ నాడు పూర్తి మొత్తం వసూలు చేసుకొనేవి.

బ్యాంకుకి అత్యవసరం అయితే, అలా తాము డిస్కవుంట్ చేసుకున్న బిల్లుల మొత్తం విలువని, రిజర్వ్ బ్యాంకు దగ్గర తనఖా పెట్టి, వడ్డీకి పైకం పొందేవి. అలా రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటునే "బ్యాంక్ రేట్" అనేవారు.  

రిజర్వ్ బ్యాంకు యెప్పటికప్పుడు తన "బ్యాంక్ రేటు" ని ప్రకటించేది. మార్చాల్సి వస్తే, ఫలానా తేదీ నించి నా బ్యాంక్ రేట్ ఇంత--అని ప్రకటించేది. 

అందుకనే, బ్యాంకులు తమ వడ్డీ రేట్లకి ఆధారం గా ఈ బ్యాంక్ రేట్ ని స్వీకరించేవి--ప్రభుత్వమైనా, కోర్టులైనా, ప్రజలైనా ఇదే రేటుకి కట్టుబడేవారు--అదీ ఆ రేటుకున్న "పావిత్ర్యం" (Sanctity)!

--మిగతా మరోసారి.

No comments: