Thursday, July 1, 2010

వడ్డీ రేట్లు

బేస్ రేట్

"నీ యెడం చెయ్యి తియ్యి, నా పుర్రచెయ్యి పెడతాను" అన్నాట్ట వెనకటికెవడో!

అలా వుంది మన బ్యాంకుల వ్యవహారం.

సంస్కరణలకి పూర్వం, రిజర్వ్ బ్యాంక్ మన బ్యాంకుల వడ్డీ రేట్లని నియంత్రించేది. 

"బ్యాంక్ రేట్" (రిజర్వ్ బ్యాంక్ రీడిస్కౌంట్ రేట్) ఇంత అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేది. బ్యాంకులు 'బ్యాంక్ రేట్ కన్నా ఇంత శాతం అధికం' అని చెప్పి, అంతా వసూలు చేసేవి--ఋణాలపై.

(రిజర్వ్ బ్యాంక్ రీ డిస్కౌంట్ రేట్ గురించి నా ఇదివరకటి టపాలు చూడండి)

సంస్కరణల పుణ్యమా అని, బ్యాంక్ రేట్ రద్దు చెయ్యబడింది--బ్యాంకులనే వాటి ప్రథాన వడ్డీ రేట్లు (ప్రైమ్ లెండింగు రేట్లు) నిర్ధారించుకోమని స్వేఛ్ఛ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్.

(ఇదే పుణ్యం గా ఇంకా చాలా స్వేఛ్ఛలని ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. వుదాహరణకి, కొత్త బ్రాంచీలు తెరవడానికి తన 'లైసెన్స్' అక్కర్లేదనీ, ఇంతకు ముందు వున్నట్టు 'సర్వీస్ యేరియా'ల లోనే అప్పులు ఇవ్వఖ్ఖర్లేదు, దేశం మొత్తం మీద యెక్కడైనా ఇవ్వచ్చు--ఇలాంటివి! కానీ మన బానిస బుధ్ధి బ్యాంకులు ఒక్క అప్పులు ఇవ్వడం విషయం లోనే పాటించాయి--దాంతో ఎన్ పీ యే లు పెరిగిపోయి, దివాళా స్థితికి వచ్చాయి--అది వేరే సంగతి)

బ్యాంక్ రేట్ అంటే, ఫలానా తేదీ నించీ ఇంత అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేది. కాబట్టి అందరికీ ఆ రేటు తెలుసు--కోర్టులకి కూడా!

కానీ, పి ఎల్ ఆర్ కి వున్న 'పావిత్ర్యం' యేమిటి? యేయే రోజున యేయే బ్యాంక్ పి ఎల్ ఆర్ యెంత వుంది అన్నది యెవరికీ తెలియదు కదా? (తెలివైన లాయరు యెవరైనా బ్యాంకుల ప్రో నోట్లని కోర్టులో సవాలు చేస్తూ, ఫలానా రోజున మీ పి ఎల్ ఆర్ యెంతా? అది యెప్పుడెప్పుడు యెంతెంత మారిందీ, ఆ లెఖ్ఖన నా క్లయింట్ కట్టవలసిన బాకీ యెంత? అని అడిగితే, బ్యాంకులే తెల్లమొగం వెయ్యవలసిన పరిస్థితి!)

(పీ ఎల్ ఆర్ లలో యెన్ని వెరైటీలు కనిపెట్టారో కూడా నా పాత టపాలు చదివి తెలుసుకోండి)

సరే--అయిపోయింది. 

మరిప్పుడు, పీ ఎల్ ఆర్ స్థానం లో 'బేస్ రేట్' అని పెట్టి, దాన్ని 'శాస్త్రీయం గా' బ్యాంకులు నిర్ణయించుకోమంటే మాత్రం, దాని 'పావిత్ర్యం' యేమి వుంటుంది?

దీని మీద సో కాల్డ్ బ్యాంకింగ్ నిపుణుల వూహాగానాలు--ఋణాలు యెవరికి తక్కువ వడ్డీ కి అందుతాయి, యెవరికి పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థమీద వాటి ప్రభావం, 'టీజర్ రేట్లు' (ఇదో రకం వెర్రి) కొనసాగుతాయా లేదా?--ఇలా!

చెరువులో గేదెని ముంచి, కొమ్ములుచూసి బేరం చేస్తున్నట్టు లేదూ?

No comments: