Tuesday, April 28, 2009

పచ్చి మోసం

"చేతులు కాలాక…….

………..ఆకులు పట్టుకోవడం" మన భారతీయులకీ, ముఖ్యం గా తెలుగు వాళ్ళకీ బాగా అలవాటే!

“ఓ వుండవల్లి అరుణ కుమార్! ఓ జక్కంపూడి రామ్మోహన రావూ! ఈ ‘మణుప్పురం’, ఈ ‘ముథూట్ ఫైనాన్స్’ ల గురించి మాట్లాడరేమి (రా!)

రామోజీ రావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా జమ కట్టుకున్న ప్రతీ పైస తిరిగి చెల్లించినా, ‘నిబంధనలకి విరుద్ధంగా వసూలు చేశారు’ అంటూ ఓ గోల చేసారే!

మరి వీళ్ళు “యే నిబంధన ప్రకారం ‘గోల్డ్ లోన్’, ‘ఫైనాన్స్’ సాగిస్తున్నారో మీకేమైనా పట్టిందా?

పక్క పెంకుటింట్లో వుండే ఒకాయన మేడలో వున్నా ఒకాయన దగ్గర ‘అత్యవసరం గా అవసరం వచ్చింది, ఈ బంగారు గొలుసు మీ దగ్గరుంచుకొని, ఓ మూడు వందలు ఇప్పించండి’ అంటే, ఆ మేడాయన జాలి పడి, ప్రో నోటు వ్రాయించుకొని, గొలుసు తీసుకొని, ఆ మూడు వందలూ అప్పిస్తే, తరవాత—కొన్నాళ్ళకి ‘నువ్వు పాన్ బ్రోకరు లైసెన్స్ లేకుండా బంగారం తాకట్టు వ్యాపారం చేస్తున్నావు’ అని ప్రభుత్వం ‘అరెస్ట్’ చేసింది!

మరి ఈ ‘మణుప్పురం’, ‘ముథూట్’ లకి కనీసం పాన్ బ్రోకర్ లైసెన్స్ అయినా వుందా?

* * *

ఓ ముప్ఫైయ్యేడేళ్ళ క్రితం, ఓ ‘స్కీము’ వచ్చింది! (పెట్టింది అరవ్వాళ్ళే అని వేరే చెప్పాలా?)

ఓ కాయితం మీద

సీ. నెం. పేరు, అడ్రెస్ నగదు (రూ.)

1. విళ్ళుప్పురం రామనాథన్ 1/-
2. రామనాథన్ కృష్ణన్ 1/-
3. రామనాథన్ వాసంతి 1/-
4. వేల్వెట్టిపురం వేలుపిళ్ళై 1/-
5. వేలుపిళ్ళై పిరభాకరన్ 1/-

ఇలా ప్రింటు చేయించి, అందరికీ కవర్లలో పోస్టులో పంపేవారు!

మనం చెయ్యవలసిందల్లా నెం. 5 స్థానంలో వున్న పేరు తొలగించి, మన పేరూ, అడ్రెస్ వ్రాసి, మనకి తెలిసున్నవాళ్ళందరికీ పంపించాలి! అంతే!

ఇంతకుముందు ఇంకోపని చెయ్యాలండోయ్! మన పైనున్న నలుగురు పేర్లకీ అక్కడ వ్రాసిన అడ్రెస్ లకి ఒక్కొక్క రూపాయి ‘మణియార్డరు’ చెయ్యాలి!

(యెక్కడైనా ఈ గొలుసు తెగి పోతే……..మీకింక మణియార్డరులు ఆగిపోతాయి…..అని ఓ వార్నింగ్ కూడా!)

ఇలా, ఆ నలుగురికీ, వాళ్ళెంతమందికి ఆ కూపన్లు పంపించి వుంటే అన్ని రూపాయల చొప్పున మణియార్డరులు అందేవి!

వాళ్ళతో పాటూ, మనకీ, మనం యెంతమందికి పంపిస్తే, అన్ని రూపాయలూ మణియార్డరు ద్వారా అందేవి!

మా కొండబాబు ఈ స్కీము గురించి చెప్పగానే, నేను ‘ఓ పిచ్చి బాబూ, గొలుసు తెగకుండా, పైనున్న ఒక్క పేరూ వుంచి, మిగతా నాలుగు పేర్లూ మన ఫ్రెండ్స్ వి ఇచ్చెయ్యి’ అన్నాను!

అలా ఓ పాతిక రూపాయలు అందరూ సంపాదించిన గుర్తు!

తరవాత గొలుసు తెగిపోయింది! (కారణం మీరు ఊహించండి!)

అవే రోజుల్లో, డాక్టర్ మహీధర రామ మోహన రావు (నళినీ మోహన రావా?—వీళ్ళిద్దరూ అన్నదమ్ములనుకొంటా—ఒకాయన లెఖ్ఖల గురించీ, ఒకాయన సైన్స్ గురించీ వ్రాసేవారు.) ఆంధ్ర పత్రిక వీక్లీ లో “మనీ సర్క్యులేషన్—పచ్చి మోసం!” అనే వ్యాసం వ్రాశారు!

అది చదివితే తెలిసింది—ఇది యెంత భయంకరమైన మోసమో!

మీకు వెలిగిందా?

(మిగిలింది తరవాత!)

Friday, April 17, 2009

"ఉతూతి" బ్యాంక్

"ఉతూతి" బ్యాంక్

‘అరవం! అరవం!’ అంటూ అరిచే ఈ అరవ్వాళ్ళున్నారే—అసాధ్యులు!
యెదటివాళ్ళ బలహీనతలమీద చక్కగా ఆడుకోగలరు!

అందుకే తెలుగువాళ్ళు తొంబలుగా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులని యెన్నుకున్నా, ముష్టి మంత్రి పదవులు తెలుగు వాళ్ళకీ, మంచివన్నీ అరవ్వాళ్ళకీ దక్కాయి!

అరవ్వాళ్ళ గురించి పాప్యులర్ జోక్ అందరికీ తెలిసిందే!

అమెరికా వాడు చంద్రుడి మీద కాలు పెట్టగానే, ‘వేడి వేడి కాఫీ కావాలా సార్’ అంటూ యెదురొచ్చాడట—అప్పటికే అక్కడ ఓ సాంబారు హోటల్ యేర్పాటు చేసిన తమిళ తంబి!

ఇంక మనవాళ్ళ విషయానికొస్తే అరవ్వాళ్ళు పెట్టిన ‘గోవిందా ఏజన్సీస్’ అయినా, ‘సప్తగిరి ఎంటెర్ప్రైజస్’ అయినా, వెంటనే డబ్బులు కట్టేసి, ‘వాటికి పిల్లలు యెప్పుడు పుడతాయా’ అని యెదురు చూస్తూ వుంటారు! (తరవాత వాళ్ళ నెత్తిన చెంగు వేసినా, మొదట లాభపడ్డవాళ్ళు మళ్ళీ ఇంకోదానికి తయారు!)

ఇంకా చెప్పాలంటే, అదేదో సినిమాలో ‘ఉతూతి బ్యాంక్’ పెట్టినట్టూ, ‘అమృతం’ టీవీ సీరియల్లో ‘రిసీప్ట్’ కౌంటెర్ లో డబ్బు కట్టి, రసీదు ‘పేమెంట్’ కౌంటెర్ లో చూపిస్తే ‘రెట్టింపు డబ్బు’ ఇస్తారన్నా నమ్మేస్తారు!

‘మణుప్పురం’ గోల్డ్ లోన్; ‘ముథూతి ఫైనాన్స్’—సారీ ‘ముథూథ్ ఫైనాన్స్’ లాంటి వ్యాపార సంస్థలు ఈనాడు పేపర్లో, మొదటి పేజీలో పావు పేజీ ప్రకటనలు ఇస్తున్నారు—‘గ్రాముకి రూ.1,325/-‘ ఇస్తాము—ఇలాగ!

నిన్న వైజాగ్ లో బంగారం రేటు గ్రాముకి రూ.1,355/-. తణుకు లోనూ, నరసాపురం లోనూ గ్రాము రూ.1,325/-!

మరి వాళ్ళు గ్రాముకి రూ.1,325/- లోను ఇచ్చేస్తే, రేపు బంగారం రేటు తగ్గితే, వాళ్ళ పరిస్థితేమిటి?

(అలా మనం ఆలోచిస్తాము!)

కానీ, వాళ్ళు, యేరోజుకారోజు వచ్చిన బంగారాన్నంతా వాళ్ళ తమిళనాడుకి తరలించేస్తున్నారు! (మీరు విడిపించడానికి వచ్చినప్పటి మాట కదా!)

ఈ మధ్య, ఎలక్షన్ హడావిడిలో పోలిసులు ఓ కారు లో తరలిస్తున్న బంగారాన్నీ, లక్షల్లో వున్న నగదునీ పట్టుకొంటే, అందులో వున్నాయన ‘నేను ఫలానా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజరుని, మా ఇంకో బ్రాంచికి తరలిస్తున్నానూ’ అన్నాడట!

మరి పోలీసులు, ‘ఎస్కార్ట్ లేకుండా, గార్డులు లేకుండా, యే బ్యాంకూ ఇలా తరలించదు’ అన్నారట!

వింటే ఇది ‘ఉథూత్’ ఫైనాన్స్ యేమో అనిపించడంలేదూ?

మరి ఇక తెలుగు ప్రజల్నీ, వాళ్ళ బంగారాన్నీ ఆ దేవుడైనా రక్షించగలడా?

చూద్దామండి!