Thursday, November 19, 2009

ఆకులు నాకేవాళ్ళ.....


.....మూతులు నాకేవాళ్ళు


బ్యాంకులు చేసేపని ప్రజల దగ్గర వారి అవసరానికి మించిన, లేదా పొదుపు చేసుకున్న డబ్బుని 'డిపాజిట్'ల రూపం లో సేకరించి, వారికి కొంత వడ్డీని ఇవ్వడం--అవసరం వున్నవాళ్ళకి మళ్ళీ ఆ డబ్బుని అప్పుగా ఇవ్వడం, దానిమీద కొంచెం యెక్కువ వడ్డీ తీసుకోవడం. ఆ వడ్డీలమధ్య తేడానే బ్యాంకుల లాభం. 


స్థూలంగా ఇదీ సంగతి.  


ఓ కేంద్ర ఆర్థిక మంత్రి కన్ను ఈ వడ్డీ ఆదాయం మీద పడింది. 


దాంతో, తన బడ్జెట్ లో ఈ బ్యాంకుల వడ్డీ ఆదాయం మీద చట్ట సభలో 'ఇంటరెస్ట్ ఆన్ టాక్స్' అని ప్రకటించి, పన్ను విధించాడు! (తరవాత దిద్దుకుని, 'టాక్స్ ఆన్ ఇంటరెస్ట్' గా మార్చి వ్యవహరించారు.)  


ఇంకేం? కాలుమీద కాలువేసుకుని కూర్చొని, ఆయాసపడకుండా యెంత సంపాదన--ప్రభుత్వానికి! యెంత మహత్తరమైన ఆలోచన!  


అప్పుడు బ్యాంకులు తక్కువ తిన్నాయా! 


నెమ్మదిగా 'వడ్డీయేతర ఆదాయం' పెంచుకోవడం మొదలెట్టాయి--ఈ చార్జీ, ఆ చార్జీ అని యెడా పెడా వాయించడం మొదలెట్టాయి!  


కొన్నేళ్ళకి ఆ వడ్డీ లెఖ్ఖలూ, దానిమీద పన్నుల లెఖ్ఖలూ కోసం అయ్యే ఖర్చే వచ్చే ఆదాయాం కన్నా యెక్కువ అవడం, బ్యాంకుల, ఖాతాదారుల ఫిర్యాదుల కారణం గానూ, పైగా వోట్ల కోసం--ఇంకో ఆర్థిక మంత్రి చేత ఈ పన్ను తొలగించబడింది.  


హమ్మయ్య అనుకున్నాయి బ్యాంకులు. (అలా అని వడ్డీయేతర అదాయాన్ని పెంచుకునే మార్గాలు మరిన్ని కనిపెట్టడం మానలేదు--తుమ్మితే చార్జి, దగ్గితే చార్జి అంటూ మొదలెట్టాయి. ప్రైవేట్ బ్యాంకులైతే మరీనూ!)  


అంతలో వచ్చాడు--'నల్లనివాడు, గుంటకన్నులవాడు' కాదు--ఇంకో ఆర్థిక మంత్రి! ఈసారి ఇంకా మహత్తరమైన 'అవిడియా'తో! 


వచ్చి, తన బడ్జెట్ లో 'సేవా పన్ను' విధించాడు! దీంతో, బ్యాంకులే కాకుండా, టెలిఫోన్ డిపార్ట్ మెంట్ నించి, కొరియర్ సర్వీసులదాకా--వాళ్ళు చేసిన 'సేవలకి' బిల్లులు చెల్లించమనేవాళ్ళందరినీ పన్నులవల లోకి లాక్కొచ్చి, వినియోగదారుల గూబ పేలేసి, పన్ను వసూలు చేస్తున్నాడు. (అసలు వినియోగదారులు డబ్బు చెల్లించి కొనుక్కొనేవి సేవలు యెలా అవుతాయో మరి!) 


కాలుమీద కాలువేసుకొని, అనాయాసంగా కొన్నివేల కోట్లు సంపాదిస్తున్నాడు! యెలాగా పన్ను కడుతున్నాముకదా అని వీళ్ళు ఇంకా అనేక 'ఇతర ఆదాయ మార్గాలు' వెతుక్కుంటున్నారు!  


పైగా, ఈ సంస్థలు, తాము చెల్లించే బిల్లుల లో యెంత సేవాపన్ను చెల్లించారో, అంత--సంస్థలు చెల్లించే సేవాపన్నులో మినహాయించుకోవచ్చని, ఓ వెసులుబాటు కల్పించాడు! (నిజానికి ఇప్పుడు యే సంస్థా ఈ వెసులుబాటుని వుపయోగించుకోవడం లేదు--యెందుకంటే, సంచీ లాభం చిల్లు తీసేస్తుంది మరి!)  


యెందుకో ఈ వెర్రిమొర్రి లెఖ్ఖల మంత్రజాలం!  


మనం చదువుకున్న 'బ్యాంకింగ్' సబ్జెక్ట్ లో, 'బ్యాంకు ఖాతా తెరవగానే, పాస్ బుక్, పే ఇన్ స్లిప్ బుక్, చెక్కు బుక్ జారీ చెయ్యబడతాయి. పాస్ బుక్ లో మన లావాదేవీలు ఉల్లేఖింపబడి మనకు అందజేయబడతాయి'--ఇలా చదువుకున్నాము. మరి ఈ రోజు, పాస్ బుక్ చార్జ్, చెక్కుబుక్ చార్జ్, అకౌంట్ స్టేట్ మెంట్ చార్జ్, పాస్ బుక్ అప్ డేటింగ్ చార్జ్, అప్పులకైతే లేట్ పేమెంట్ చార్జ్, ప్రీ పేమెంట్ చార్జ్, ప్రాసెసింగ్ చార్జ్, ఇన్స్ పెక్షన్ చార్జ్--ఇలా కొన్నివందల రకాల చార్జీలు వసూలు చేస్తున్నారు.  


ఇన్నాళ్టికి మన తుమ్మల కిషోర్ ఓ చక్కని పాయింటు లేవనెత్తాడు--అప్పులు ఇచ్చిన గడువు కన్నా ముందు తీర్చేవాళ్ళకి 'ప్రీ పేమెంట్' చార్జ్ వసూలు చెయ్యడం అన్యాయమని, ఇంకా అలాంటివాళ్ళకి ప్రోత్సాహకం గా రాయితీలు ఇవ్వాలి' అని.  


నిజంగా ఈ విషయం లో బాధితులు సామాన్యులే! యెందుకంటే, మిగిలినవాళ్ళు బయటి వడ్డీ కంటే, బ్యాంకు వడ్డీ చాలా చవక అని, ఛస్తే సమయానికి గానీ, సమయానికి ముందుగానీ అప్పులు కట్టరు! బ్యాంకులు విపరీతమైన వత్తిడిచేసి, పీకమీద కత్తి వేలాడదీసే పరిస్థితి వస్తే, అప్పుడు బేరం పెడతారు--యెంత వడ్డీ తగ్గిస్తావు? అసలులో యెంత తగ్గిస్తావు? అంటూ! అప్పటికే అవి నిరర్థక ఆస్తులుగా గుర్తింపబడి వుంటాయి కాబట్టి, బ్యాంకులు చచ్చినాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటాయప్పుడు!  


వినియోగదారులు ఉద్యమిస్తే వీటిలో కొన్ని నివారించవచ్చుకదూ!  


ఇంకొంచెం ఇంకోసారి.


No comments: