చిరు వ్యాపారులు
ప్రభుత్వం ప్రతీ యేటా కొన్ని కోట్లు నష్టపోతోందట--దాదాపు 6 లక్షల మంది 125 నగరాలూ, మునిసిపాలిటీల్లో రోడ్డు పక్కన పళ్ళూ, కూరగాయలూ, పువ్వులూ, పుజా సామాగ్రీ, అమ్ముకునేవాళ్ళూ, తోపుడుబళ్ళపై పెట్టుకొని వీధులు తిరిగేవాళ్ళూ 'లైసెన్స్ ' లు యేమీ తీసుకోకపోవడం వల్ల!
అందుకని, ప్రభుత్వం ఓ చట్టం చేస్తుందట! లైసెన్స్ లు మంజూరు చెయ్యడం, కొన్ని జోన్లకే పరిమితం చెయ్యడం లాంటి అవకతవక విధానాలు వుంటాయట ఆ చట్టం లో--యెందుకంటే ఆ రొచ్చులోంచి మరింత అవినీతి జన్మించాలికదా!
ఇక్కడ ముఖ్య విషయం యేమిటంటే, ఇలాంటివాళ్ళ దగ్గర, 'ఆశీలు ' వసూలు చేసేది ఆయా మునిసిపాలిటీలు. వాళ్ళ దగ్గర మామూళ్ళు వసూలు చేసుకొనేదీ, ఉచితం గా సరుకులు సంగ్రహించేదీ--పోలీసులు.
ఈ వ్యాపారుల్లో కూడా, రాజకీయ అండతోనో, మరింకో వాటితోనో కొన్ని ముఖ్య కేంద్రాల్లో తిష్ట వేసుకొని, 'ఇది మా బాబు చోటు ' అన్నట్టు, కొన్ని యేళ్ళుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం--ఇప్పుడు ఇంకొకచోటికి పొమ్మంటే పోము అనేవాళ్ళూ వున్నారు.
అది 40 అడుగుల/60 అడుగుల/80 అడుగుల రోడ్డైనా, ఓ చిన్నకారో, ఆటో నో వెళ్ళేంత మాత్రమే ఖాళీగా వుండి, రెండుపక్కలా ఆక్రమిస్తారు వీళ్ళు.
దీనికి పరిష్కారం--బస్ స్టాండ్ ల లోనూ, రైల్వే స్టేషన్ల ముందూ బోలెడు ఖాళీ స్థలం, చెట్లతో నీడనిస్తూ, వుంటుంది. అలాంటి చోట్ల వీళ్ళకి చోటు ఆర్ టీ సీ వారు, రైల్వే వారు లేదా మునిసిపాలిటీ వారు నామ మాత్రపు (ఆసీలుతో సమానమైన) అద్దెతో కేటాయిస్తే, 90 శాతం సమస్య తీరుతుంది.
ఇక తమ శారీరక శ్రమతో, బళ్ళని తోసుకుంటూ వీధి వీధీ తిరిగేవాళ్ళ దగ్గర ఇంకా యెక్కువ మొత్తాలు వసూలు చెయ్యడం మాత్రం వాళ్ళ రక్తం పీల్చడం తో సమానం!
ప్రభుత్వాలకి మంచి బుధ్ధి కలుగుగాక!
No comments:
Post a Comment