skip to main |
skip to sidebar
జూదాల నిషేధం
‘వస్తువుల సరఫరా గొలుసులో ఉన్న ప్రతీ ఒక్కరికీ గరిష్ఠ లాభ నియంత్రణను విధిస్తే ధరల పెరుగుదలను అరికట్టవచ్చు’ అని అభిప్రాయపడింది—పార్లమెంటరీ అంచనాల సంఘం! వారి నివేదిక పార్లమెంటులో ప్రవేశ పెట్టబడిందట. నవంబరు 14న పార్లమెంట్ చర్చించిందట కూడా!
వాళ్ళు చేసిన అతిముఖ్య సూచన—‘బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులపై ఫ్యూచర్స్ ట్రేడింగ్ ను నిషేధించాలి’—అని.
పై రెండూ ఎంతచక్కని సిఫార్సులో గమనించండి—వీటిని అమలుపరిచే మగాడు యెవరైనా, యే పార్టీలోనైనా వున్నాడా? వుంటే వెంటనే ఓ పార్టీ పెట్టేస్తే వాణ్ణి ప్రథాన మంత్రిని చెయ్యడానికి యెవరికీ అభ్యంతరం వుండదనుకుంటా!
ఇంకాకొన్ని సిఫారసులు—కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖలో కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ధరల పర్యవేక్షణ విభాగం ఉండాలి. బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులు తదితర 17 నిత్యావసరాల ధరలను నిత్యం పర్యవేక్షించాలి. నియంత్రణ అధికారాలూ ఇవ్వాలి.
సమాజం లోని అన్నివర్గాలకూ నిత్యావసరాలు అందించే విధం గా రేషన్ సరుకుల సరఫరా వ్యవస్థను పరిపుష్టం చేయలి.
అక్రమ నిల్వల్ని అరికట్టడానికి తాత్కాలిక నోటిఫికేషన్లు కాకుండా శాశ్వత చర్యలు ఉండాలి. కేంద్రం ఆదేశాల మేరకు అక్రమనిల్వలపై చర్యలు తీసుకోని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చ్దే రేషన్ కోటా నిలిపేయాలి.
నిత్యావసరాల చట్టం ఉల్లంఘించే వారిపై కేసుల దర్యాప్తునకు ప్రత్యేక కోర్టులను యేర్పాటు చేయాలి.
ఒకపక్కన పప్పుల ధరలు మండుతుంటే….వ్యాపారులు రెండులక్షల టన్నుల పప్పులను దిగుమతిచేసుకొని, ముంబయి, ట్యూటికోరిన్ రేవుల్లోని గోదాముల్లో దాచిపెట్టడం ఘోరం. నిత్యావసరాల అక్రమ నిల్వలపై ప్రభుత్వం కఠినం గా వ్యవహరించాలి.--ఇవీ!
మన పెజారాజ్యాలూ, లోక్ సత్తాలూ ఇలాంటివాటికోసం ఆందోళనలు చేస్తే బాగుండును!
.....మూతులు నాకేవాళ్ళు
బ్యాంకులు చేసేపని ప్రజల దగ్గర వారి అవసరానికి మించిన, లేదా పొదుపు చేసుకున్న డబ్బుని 'డిపాజిట్'ల రూపం లో సేకరించి, వారికి కొంత వడ్డీని ఇవ్వడం--అవసరం వున్నవాళ్ళకి మళ్ళీ ఆ డబ్బుని అప్పుగా ఇవ్వడం, దానిమీద కొంచెం యెక్కువ వడ్డీ తీసుకోవడం. ఆ వడ్డీలమధ్య తేడానే బ్యాంకుల లాభం.
స్థూలంగా ఇదీ సంగతి.
ఓ కేంద్ర ఆర్థిక మంత్రి కన్ను ఈ వడ్డీ ఆదాయం మీద పడింది.
దాంతో, తన బడ్జెట్ లో ఈ బ్యాంకుల వడ్డీ ఆదాయం మీద చట్ట సభలో 'ఇంటరెస్ట్ ఆన్ టాక్స్' అని ప్రకటించి, పన్ను విధించాడు! (తరవాత దిద్దుకుని, 'టాక్స్ ఆన్ ఇంటరెస్ట్' గా మార్చి వ్యవహరించారు.)
ఇంకేం? కాలుమీద కాలువేసుకుని కూర్చొని, ఆయాసపడకుండా యెంత సంపాదన--ప్రభుత్వానికి! యెంత మహత్తరమైన ఆలోచన!
అప్పుడు బ్యాంకులు తక్కువ తిన్నాయా!
నెమ్మదిగా 'వడ్డీయేతర ఆదాయం' పెంచుకోవడం మొదలెట్టాయి--ఈ చార్జీ, ఆ చార్జీ అని యెడా పెడా వాయించడం మొదలెట్టాయి!
కొన్నేళ్ళకి ఆ వడ్డీ లెఖ్ఖలూ, దానిమీద పన్నుల లెఖ్ఖలూ కోసం అయ్యే ఖర్చే వచ్చే ఆదాయాం కన్నా యెక్కువ అవడం, బ్యాంకుల, ఖాతాదారుల ఫిర్యాదుల కారణం గానూ, పైగా వోట్ల కోసం--ఇంకో ఆర్థిక మంత్రి చేత ఈ పన్ను తొలగించబడింది.
హమ్మయ్య అనుకున్నాయి బ్యాంకులు. (అలా అని వడ్డీయేతర అదాయాన్ని పెంచుకునే మార్గాలు మరిన్ని కనిపెట్టడం మానలేదు--తుమ్మితే చార్జి, దగ్గితే చార్జి అంటూ మొదలెట్టాయి. ప్రైవేట్ బ్యాంకులైతే మరీనూ!)
అంతలో వచ్చాడు--'నల్లనివాడు, గుంటకన్నులవాడు' కాదు--ఇంకో ఆర్థిక మంత్రి! ఈసారి ఇంకా మహత్తరమైన 'అవిడియా'తో!
వచ్చి, తన బడ్జెట్ లో 'సేవా పన్ను' విధించాడు! దీంతో, బ్యాంకులే కాకుండా, టెలిఫోన్ డిపార్ట్ మెంట్ నించి, కొరియర్ సర్వీసులదాకా--వాళ్ళు చేసిన 'సేవలకి' బిల్లులు చెల్లించమనేవాళ్ళందరినీ పన్నులవల లోకి లాక్కొచ్చి, వినియోగదారుల గూబ పేలేసి, పన్ను వసూలు చేస్తున్నాడు. (అసలు వినియోగదారులు డబ్బు చెల్లించి కొనుక్కొనేవి సేవలు యెలా అవుతాయో మరి!)
కాలుమీద కాలువేసుకొని, అనాయాసంగా కొన్నివేల కోట్లు సంపాదిస్తున్నాడు! యెలాగా పన్ను కడుతున్నాముకదా అని వీళ్ళు ఇంకా అనేక 'ఇతర ఆదాయ మార్గాలు' వెతుక్కుంటున్నారు!
పైగా, ఈ సంస్థలు, తాము చెల్లించే బిల్లుల లో యెంత సేవాపన్ను చెల్లించారో, అంత--సంస్థలు చెల్లించే సేవాపన్నులో మినహాయించుకోవచ్చని, ఓ వెసులుబాటు కల్పించాడు! (నిజానికి ఇప్పుడు యే సంస్థా ఈ వెసులుబాటుని వుపయోగించుకోవడం లేదు--యెందుకంటే, సంచీ లాభం చిల్లు తీసేస్తుంది మరి!)
యెందుకో ఈ వెర్రిమొర్రి లెఖ్ఖల మంత్రజాలం!
మనం చదువుకున్న 'బ్యాంకింగ్' సబ్జెక్ట్ లో, 'బ్యాంకు ఖాతా తెరవగానే, పాస్ బుక్, పే ఇన్ స్లిప్ బుక్, చెక్కు బుక్ జారీ చెయ్యబడతాయి. పాస్ బుక్ లో మన లావాదేవీలు ఉల్లేఖింపబడి మనకు అందజేయబడతాయి'--ఇలా చదువుకున్నాము. మరి ఈ రోజు, పాస్ బుక్ చార్జ్, చెక్కుబుక్ చార్జ్, అకౌంట్ స్టేట్ మెంట్ చార్జ్, పాస్ బుక్ అప్ డేటింగ్ చార్జ్, అప్పులకైతే లేట్ పేమెంట్ చార్జ్, ప్రీ పేమెంట్ చార్జ్, ప్రాసెసింగ్ చార్జ్, ఇన్స్ పెక్షన్ చార్జ్--ఇలా కొన్నివందల రకాల చార్జీలు వసూలు చేస్తున్నారు.
ఇన్నాళ్టికి మన తుమ్మల కిషోర్ ఓ చక్కని పాయింటు లేవనెత్తాడు--అప్పులు ఇచ్చిన గడువు కన్నా ముందు తీర్చేవాళ్ళకి 'ప్రీ పేమెంట్' చార్జ్ వసూలు చెయ్యడం అన్యాయమని, ఇంకా అలాంటివాళ్ళకి ప్రోత్సాహకం గా రాయితీలు ఇవ్వాలి' అని.
నిజంగా ఈ విషయం లో బాధితులు సామాన్యులే! యెందుకంటే, మిగిలినవాళ్ళు బయటి వడ్డీ కంటే, బ్యాంకు వడ్డీ చాలా చవక అని, ఛస్తే సమయానికి గానీ, సమయానికి ముందుగానీ అప్పులు కట్టరు! బ్యాంకులు విపరీతమైన వత్తిడిచేసి, పీకమీద కత్తి వేలాడదీసే పరిస్థితి వస్తే, అప్పుడు బేరం పెడతారు--యెంత వడ్డీ తగ్గిస్తావు? అసలులో యెంత తగ్గిస్తావు? అంటూ! అప్పటికే అవి నిరర్థక ఆస్తులుగా గుర్తింపబడి వుంటాయి కాబట్టి, బ్యాంకులు చచ్చినాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటాయప్పుడు!
వినియోగదారులు ఉద్యమిస్తే వీటిలో కొన్ని నివారించవచ్చుకదూ!
ఇంకొంచెం ఇంకోసారి.
చిరు వ్యాపారులు
ప్రభుత్వం ప్రతీ యేటా కొన్ని కోట్లు నష్టపోతోందట--దాదాపు 6 లక్షల మంది 125 నగరాలూ, మునిసిపాలిటీల్లో రోడ్డు పక్కన పళ్ళూ, కూరగాయలూ, పువ్వులూ, పుజా సామాగ్రీ, అమ్ముకునేవాళ్ళూ, తోపుడుబళ్ళపై పెట్టుకొని వీధులు తిరిగేవాళ్ళూ 'లైసెన్స్ ' లు యేమీ తీసుకోకపోవడం వల్ల!
అందుకని, ప్రభుత్వం ఓ చట్టం చేస్తుందట! లైసెన్స్ లు మంజూరు చెయ్యడం, కొన్ని జోన్లకే పరిమితం చెయ్యడం లాంటి అవకతవక విధానాలు వుంటాయట ఆ చట్టం లో--యెందుకంటే ఆ రొచ్చులోంచి మరింత అవినీతి జన్మించాలికదా!
ఇక్కడ ముఖ్య విషయం యేమిటంటే, ఇలాంటివాళ్ళ దగ్గర, 'ఆశీలు ' వసూలు చేసేది ఆయా మునిసిపాలిటీలు. వాళ్ళ దగ్గర మామూళ్ళు వసూలు చేసుకొనేదీ, ఉచితం గా సరుకులు సంగ్రహించేదీ--పోలీసులు.
ఈ వ్యాపారుల్లో కూడా, రాజకీయ అండతోనో, మరింకో వాటితోనో కొన్ని ముఖ్య కేంద్రాల్లో తిష్ట వేసుకొని, 'ఇది మా బాబు చోటు ' అన్నట్టు, కొన్ని యేళ్ళుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం--ఇప్పుడు ఇంకొకచోటికి పొమ్మంటే పోము అనేవాళ్ళూ వున్నారు.
అది 40 అడుగుల/60 అడుగుల/80 అడుగుల రోడ్డైనా, ఓ చిన్నకారో, ఆటో నో వెళ్ళేంత మాత్రమే ఖాళీగా వుండి, రెండుపక్కలా ఆక్రమిస్తారు వీళ్ళు.
దీనికి పరిష్కారం--బస్ స్టాండ్ ల లోనూ, రైల్వే స్టేషన్ల ముందూ బోలెడు ఖాళీ స్థలం, చెట్లతో నీడనిస్తూ, వుంటుంది. అలాంటి చోట్ల వీళ్ళకి చోటు ఆర్ టీ సీ వారు, రైల్వే వారు లేదా మునిసిపాలిటీ వారు నామ మాత్రపు (ఆసీలుతో సమానమైన) అద్దెతో కేటాయిస్తే, 90 శాతం సమస్య తీరుతుంది.
ఇక తమ శారీరక శ్రమతో, బళ్ళని తోసుకుంటూ వీధి వీధీ తిరిగేవాళ్ళ దగ్గర ఇంకా యెక్కువ మొత్తాలు వసూలు చెయ్యడం మాత్రం వాళ్ళ రక్తం పీల్చడం తో సమానం!
ప్రభుత్వాలకి మంచి బుధ్ధి కలుగుగాక!
పొట్టలు
ఇదివరకోసారి వ్రాశాను--స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ లాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రీ, గవర్నరూ పోలీసు పెరేడ్ తిలకించి, వందనం స్వీకరించడం, ఆ పోలీసుల, అధికారుల పొట్టల గురించీ, వాళ్ళ అస్తవ్యస్త 'మార్చింగ్' గురించీ!
మరి అదే మిలిటరీలో అయితే, యెంత వున్నతాధికారైనా, పొట్ట అనేది వుండదు--వాళ్ళు మార్చింగ్ చేస్తూంటే, గునపాలు క్రమబధ్ధంగా చేతులు వూపుతే వెళుతున్నట్టు వుంటుంది!
వాళ్ళు మమూలుగా బ్యారక్స్ లో కుటుంబాలతోనే (యెక్కడో సరిహద్దుల్లో తప్పించి) వున్నా, ప్రతి రోజూ పీటీ దగ్గరనించి, పెరేడ్ దాకా రెండు పూటలా చేస్తారు--ఒక్క సీరియస్ గా సిక్ అయితే తప్ప! ఆశ్రమకి తగ్గట్టు తింటారు కూడా!
ఇప్పుడు ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందట--పోలీసులకి ప్రత్యేక శిక్షణ ఇస్తారట కొంతకాలం పాటు--ఫిజికల్ ఫిట్నెస్ కోసం (పొట్టలు తగ్గడానికి)!
మరి ఈ పథకం తో మరిన్ని కోట్లు తగలేస్తారో, పొట్టల్ని తగ్గిస్తారో చూడాలి!