దిగిరావు దిగిరావు.....
ఈ పంట విస్తీర్ణం లెఖ్ఖలు నిజం గా నిజమయితే, సీజన్లో రైతులు తాము పండించిన టమాటాల్లాంటివాటిని కేజీ పది పైసలకి కూడా కొనేవాళ్ళు లేక, రోడ్డు పక్కన పారబొయ్యడమో, తగులబెట్టడమో, పశువులకి మేపడమో యెందుకు జరుగుతోంది?
మళ్ళీ ఆ సీజన్ అయిపోగానే, అంతకు ముందు మార్కెట్ లో వున్న ధరకంటే యెక్కువగా అదే వుత్పత్తి బాగా పెరిగిన ధరతో అమ్మబడటం యేమిటి?
మహా అయితే ఒక నెలో, రెండునెలలో ఆ ధర తగ్గకుండా కాపాడితే చాలు మార్కెట్ శక్తులకి!
సరిగ్గా అక్కడే జరుగుతోంది గోల్ మాల్!
నయా మార్కెటింగ్ మేనేజర్లు ఆ రెండు నెలలకీ కొనుగోళ్ళు అవసరం లేకుండా, తక్కువ ధర దగ్గరే అప్పటికి డెలివరీ ఇచ్చేలాగ కాంట్రాక్టులు చేసేసుకుంటున్నారు!
ఈ లోపల 'అదిగో పులి ' అన్నట్టు--'కొలకత్తాలో బంగాళదుంపలు.....' లాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు--మీడియా వీరికి సహకరిస్తోంది--ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వుండి, తైనాతీలు బాగా సంపాదించుకోడానికి గేట్లు యెత్తేస్తున్నారు!
ఇంకా, నయా కార్పొరేట్ చిల్లర దుకాణాలు ప్రతీ పదార్ధాన్నీ ప్రతీ వూళ్ళోనూ టన్నులకొద్దీ నిలవేస్తున్నాయి--తరవాత ధర బాగా పెరుగుతుందని అందరూ నమ్మినప్పుడు! అలా అయితేనే ఇబ్బడి ముబ్బడి లాభాలు వస్తాయి మరి!
ఇక చక్కెర గురించి వేరే చెప్పక్కర్లేదు!
సీజన్లో యే రోడ్డు మీద చూసినా, వరుసగా కొన్ని వేల చెరకు బళ్ళూ, లారీలూ--అవి మొయ్యలేనంత లోడుతో చక్కెరమిల్లులవైపు యెడతెగకుండా, రాత్రీ పగలూ--మిగిలిన వాహనాలని కూడా సాఫీగా పోనివ్వకుండా, ట్రాఫిక్ జాముల్ని సృష్టిస్తూ సాగుతూనే వుంటాయి కదా?
మరి వుత్పత్తి అయ్యే చక్కెర అంతా యేమౌతోంది?
గత పాతిక సంవత్సరాలుగా యెప్పుడో తప్ప 'ముడి చక్కెర దిగుమతి ' చేసుకోకుండా యెప్పుడైనా జరుగుతోందా? చక్కెర కుంభకోణాలు జరగకుండా వున్నాయా? మంత్రులు సైతం రాజీనామాలు ఇచ్చి, శిక్షలు పడ్డవాళ్ళు కూడా వున్నారు కదా!
అలాగే ధాన్యం సీజనుల్లో!
చింతపండు లాంటి వాటికొస్తే, మన గిరిజన కోఆపరేటివ్ స్టోర్లలో టన్నులకొద్దీ మగ్గుతున్నాయని మీడియాయే చెపుతోంది!
మరి ధరలు యెందుకు తగ్గవు?
జనం అందరూ గట్టి నిర్ణయాలు తీసుకోవాలి--ప్రభుత్వం చేత ఆహార పదార్థాల ధరల మీద జూదాలని, మధ్యవర్తులు, కాంట్రాక్టు వ్యాపారులూ అడ్డంగా సంపాదించుకోడాన్నీ నిరోధించాలని!
అసంఘటిత మార్కేట్ కన్నా తక్కువ ధరకి అమ్ముతామన్నా, కంపెనీల చిల్లర దుకాణాల్లో యేమీ కొనము--వాళ్ళని ఈగలు తోలుకొనేలా చేస్తాము--అని!
దొంగ నిల్వలనీ, రవాణానీ పట్టుకున్న తరవాత రోజువారీగా యేమి జరుగుతోందో బయటపెట్టమని మీడియాని వొత్తిడి చేస్తామనీ--వాళ్ళ ఫోనులు 24 గంటలూ మోగుతూనే వుండేలా, సరైన సమాధానం ప్రతీరోజూ పేపర్లలో, టీవీల్లో వచ్చేదాకా నిద్రపోమని!
ఇలాంటి నిర్ణయాలు తీసుకొని, అమలు చేస్తే, రెండు మూడు నెలల్లోనే ధరలు భూమిని తాకవూ?
ఆలోచించండి!
No comments:
Post a Comment