Tuesday, September 15, 2009

పైపైకే.....


దిగిరావు దిగిరావు.....


'కొలకత్తాలో బంగాళదుంపల పైరుకి వైరస్ ' సోకిందట! అందుకని ఇక్కడ ధరలు బాగా పెరిగాయట!  


'మీ కొలకత్తాలో బంగాళా దుంపలు పండుతాయా?' అని అడిగి, 'యెలా కొట్టాను దెబ్బ?' అని అడగాలనిపించడం లేదూ?  


అదేదో సినిమాలో, మోహన్ బాబు యేటిగట్టున చెట్టుక్రింద కూర్చొని, అప్పుడే రేవుదాటి వచ్చినాయన 'అగ్గిపెట్టుందా?' అని అడిగిన ప్రశ్నకి 'మందేవూరు?' అని యెదురు ప్రశ్నవేసి, 'దోసకాయల పల్లి ' అనగానే, 'యేం? మీదోసకాయలపల్లిలో అగ్గిపెట్టెలు దొరకవా?' అనడిగి, పక్కవాళ్ళతో 'యెలాకొట్టాను దెబ్బ? ఆన్?' అంటాడు.  


మరి కొలకత్తా నగరం లో బంగాళా దుంపలు పండటమేమిటీ, వాటికి వైరస్ సోకడమేమిటీ, దాన్ని పత్రికలు ప్రముఖం గా ప్రచురించడమేమిటి!  


ఇక, చక్కెర (చెరకు) పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయిందిట--అందుకని చెక్కెర ధర బాగా పెరిగి పోయిందట!  


చింతపండు చత్తీస్ గఢ్, జార్ఖండ్ ల నించి రావడం తగ్గిపోయిందట--అందుకని చింతపండు ధర బాగా పెరిగిపోయిందట!  


ఇలా ధర పెరగని ఆహార పదార్థం యేదైనా మిగిలిందా? దీనికి అసలు కారణం యేమిటీ?  


మన ప్రభుత్వాలూ, వ్యవాసాయాధికారులూ వేసేవన్నీ కాకుల్లెక్కలు. ఇళ్ళలోనో, ఆఫీసుల్లోనో కూర్చొని, వివిధ అవసరాలకోసం తమని కలవడానికొచ్చే వాళ్ళ నించి సమాచారం సేకరించి, పంటల విస్తీర్ణం గురించి 'క్రితం యేడాది కన్నా--కొంచెం యెక్కువో, కొంచెం తక్కువో' అంచనాలువేసి, నివేదికలు సమర్పించేస్తారు!  


ఇక బ్యాంకులు ఇచ్చే పంట ఋణాల లెఖ్ఖల మీద ఆధారపడి, కొంత సర్దుబాట్లు చేస్తారు!  


ఈ లెఖ్ఖలెంత గొప్పవంటే-- ప్రతీ జిల్లాలోనూ, ఒక్కొక్క పంటకీ అవసరమైన పెట్టుబడిని అంచనావేసి, యే పంటకి--యెకరానికి--యెంత అప్పు ఇవ్వచ్చు అని నిర్ధారణ చేస్తారు (దీన్నే 'స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ' అంటారు).  


ఆప్పు యెక్కువ కావలసినవాళ్ళు, యెక్కువ దేనికి వస్తే ఆ పంట అని చెప్పి, యెక్కువ తీసుకొంటారు (నిజంగా వాళ్ళే పంట వేసినా!).  


ఇక 'ఇన్స్యూరెన్స్ ' అనే ఓ ప్రహసనం వుంది--వర్షాలు లేకపోయినా, ప్రకృతి విపత్తులు వచ్చినా, తెగుళ్ళూ వగైరా వచ్చినా--ఇన్స్యూరెన్స్ వస్తుంది. దీంట్లో ఓ మెలిక యేమిటంటే, ప్రభుత్వం 'వర్షాల్లేవు ' అని ప్రకటిస్తే, వర్షాధార నేలల్లో అలాంటి పంటలు వేసినవాళ్ళకే ఇన్స్యూరెన్స్ వస్తుంది. బోర్లు, చెరువులూ, కాలువల కింద భూములకి ఇన్స్యూరెన్స్ రాదు! ఇలాగ మిగిలిన కారణాలకి కూడా.  


ఒక బ్యాంకులో బోర్లు వెయ్యడానికో, బావులు తవ్వడానికో అప్పులు తీసుకున్నవాళ్ళు, పంట ఋణాలు తీసుకుంటే, ఆ బ్యాంకువాళ్ళేమి వ్రాస్తారు? ఆ భూమి వర్షాధారం కాదు--అనే కదా? యెక్కువ అప్పుకోసం ఇంకో పంట అని చెప్పిన వాళ్ళకి, ఆ పంట దెబ్బతిందని ప్రభుత్వం ప్రకటించకపోతే, ఇన్స్యూరెన్స్ రాదు కదా?  


అయినా, చోటా మోటా రాజకీయుల ప్రోద్బలం తో, 'పక్కవాడికి ఇన్స్యూరెన్స్ వచ్చింది--నాకెందుకు రాలేదు?' అని బ్యాంకు మేనేజర్లమీద దెబ్బలాడి, ధర్నాలూ అవీ చేసి, బ్యాంకులకి తాళాలు వేసిన సంఘటనలు కూడా వున్నాయి!  


ఇక బ్యాంకువాళ్ళేం చేస్తారు? అన్ని భూముల్నీ 'వర్షాధార ' అనే వ్రాసి, అక్కడ మామూలుగా యే పంట నాశనం అవుతూవుంటుందో, ఆ పంటనే వేసినట్టు వ్రాసేస్తున్నారు!  


అలా అనంతపురం జిల్లా మొత్తం 'వేరుశెనగ ' పంటే వేస్తారు, అన్నీ వర్షాధార భూముల్లోనే వేస్తారు, ఆ కొండలమీదా గుట్టలమీదా యెలాగూ 30 నించి 70 శాతం నష్టం వస్తుంది--అందరికీ కొద్దో గొప్పో ఇన్స్యూరెన్స్ వస్తుంది!  


ఇవండీ మన పంట విస్తీర్ణం లెఖ్ఖలు!  


ఇక ధరల పెరుగుదలకి మిగతా కారణాలగురించి మరోసారి.





No comments: