Sunday, August 30, 2009

మన తెలుగుతల్లి


గలగలా కృష్ణమ్మ


అగస్థ్య మహర్షి వింధ్య పర్వతం తలవంచి దక్షిణ భారతానికి వచ్చాక, తన కమండలం లోని నీటిని నర్మద, తపతి, మహానది, కృష్ణ, తుంగభద్ర, కావేరి--ఇలా వివిధ నదులుగా ప్రవహింపచేసి, తిరిగి సముద్ర ప్రవేశం కల్పించాడు!  


కాని, మన కృష్ణమ్మ విజయాద్రి (అర్జునుడు పాశుపతం కోసం తపస్సు చేసిన కొండ), ఇంద్రకీలాద్రి లని సమీపించి, అవి చాలా యెత్తుగా వుండడంతో, అక్కడ ఆగిపోయింది--ఆ భూమంతా పెద్ద జలాశయంగా మారిపోయింది!  


అప్పుడు మళ్ళీ అగస్థ్యుడు అక్కడికి చేరి, శ్రీ కనకదుర్గమ్మని తన ముక్కెర యెరువడిగి, దాంతో విజయాద్రి కి చిన్న 'బెజ్జం' చేశాడు! 


అందులోంచి కృష్ణమ్మ హడావిడిగా వెల్లిపోబోతే, దుర్గమ్మ ముక్కెర కొట్టుకుపోయింది! వెంటనే, కృష్ణమ్మ తన ముక్కెర దుర్గమ్మకి ఇచ్చి, 'అక్కా మళ్ళీ నీదగ్గరికి వచ్చినప్పుడు ఇద్దూగాన్లే!' అంటూ వెళ్ళిపోయింది!  


ప్రవాహ వేగానికి విజయాద్రి రెండుగా చీలిపోయింది! 


దుర్గాంబ కొండా, విజయాద్రి క్రింద వెలసిన వూరే 'బెజ్జం వాడ ', తరవాత 'బెజవాడ ', నేటి 'విజయవాడ '!  


ఆ బెజ్జం మధ్యలోనే, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నేటి 'ప్రకాశం బరాజ్' నిర్మించారు!  


కృష్ణమ్మ తన ముక్కెర అడగడానికి దుర్గమ్మనెప్పుడు సమీపిస్తుందో, అప్పుడే 'కలియుగాంతం' అవుతుందట!  


అదీ సంగతి!

Monday, August 10, 2009

గోముఖమూ...గోదావరీ...గోష్పాదమూ

గోదావరి
పాపికొండల్లోని గురవాడ రిజర్వాయరు యెంత యెత్తులో వుందో తెలుసా? సాక్షాత్తూ సముద్ర మట్టం నించి 765 మీటర్లు (ట)! (అంటే 2,500 అడుగులకు పైగా!)
గోదావరి గురించీ, పాపి కొండల గురించీ, పట్టి సీమ గురించీ ఓ ఇతిహాసం ప్రాచుర్యం లో వుంది.
గౌతమ మహర్షి కొవ్వూరు (గోవూరే కొవ్వూరుగా మారిందట) దగ్గర వున్న ‘గోష్పాద క్షేత్రం’ లో ఆశ్రమం కట్టుకొని, తపో సాధన చేస్తూ వుండేవాడట!
ఆయన రోజూ వుదయమే సంధ్యావందనం పూర్తయ్యాక, కమండలం లోని నీళ్ళలో తడిపి, ఓ గుప్పెడు ‘అక్షతల’ని ఆశ్రమం పక్కనే చల్లుకొని, తపస్సాధనలోకి వెళ్ళిపోయేవాడట!
మధ్యాన్నం అయ్యేసరికి, చక్కగా ఆయనకి సరిపడా వరి ధాన్యం పండేవట! వచ్చే బియ్యం తో భోజనం కానిచ్చేవాడట!
ఆరోజుల్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అడవిగా వుండడంతో, ప్రజలకి పంటలు పండించుకోడానికి జలవనరేమీ లేక, వాళ్ళు కొంతమంది మునులనీ వాళ్ళనీ ఆశ్రయించి, పరిష్కారమయ్యేలా ప్రార్థించారట! వాళ్ళు ఆ కోరికతో ఇంద్రుడి శరణుజొచ్చారట! ఆయన హామీ ఇచ్చేశాడు!
ఓ రోజున మధ్యాహ్నం గౌతముడు కళ్ళు తెరిచేసరికి ఓ గోవు (ఇంద్రుడు) ఆయన వరికంకులని భోంచేస్తోందట! పాపం గౌతముడు చేతికందిన ‘తృణాన్ని’ దాన్ని అదిలించడానికి విసిరితే, ఆ గోవు అమాంతం చచ్చిపడిపోయిందట!
గౌతముడు ఖిన్నుడై, గోహత్యా పాతకం నించి యెలా విముక్తుడవ్వాలని ఆలోచిస్తూంటే, మునులందరూ ‘దక్షిణ గంగ’ ని తీసుకొచ్చి, ఆ గోవుని తడిపితే, అది పునర్జీవితమవుతుంది అని చెప్పారట!
ఇంకేం! గౌతముడు నాసికా త్ర్యంబకానికి వెళ్ళి, ఓ కొండమీద ఒంటికాలి మీద తపస్సు చేశాడట! వెంటనే దక్షిణ గంగ గోముఖం నించి ధారగా వచ్చి, గౌతముణ్ణి దారి చూపించమందట—ఆయన వెనకాలే వచ్చేసిందట!
కానీ—గురవాడ వచ్చేటప్పటికి, ఓ పెద్ద కొండ గోడలా అడ్డం నిలబడి వుందట! ఇక సాగలేక అక్కడే ఆగిపోయిందట—దక్షిణ గంగ! మరి గౌతముడి పాతకం తొలగేదెలా?
అందుకని ఆ మహర్షి ఆ కొండని వుద్దేశించి, “ఓ పాపీ! దారి విడువు” అని ఆఙ్ఞాపించాడట! వెంటనే ఆ కొండ తలవొంచి, తన పాపిడి గుండా ప్రవాహాన్ని వెళ్ళమందట! ఆ ప్రవాహ వేగానికి ఆ కొండ రెండుగా చీలిపోయి, ఇప్పటి పాపికొండలు యేర్పడ్డాయట! (వీటిని పాపిడికొండలు అని కూడా అనేవారు!
సరే—దక్షిణగంగ పాపి కొండ అడ్డంకి దాటింది—కానీ, అక్కడ లోయ పల్లంగా వుండడం వల్ల అక్కడ నిలబడిపోయిందట!
అప్పుడు గౌతముడు తన దగ్గర వున్న—క్షేత్రాన్ని దున్నడానికి చేతి తో వుపయోగించే ‘పట్టిసం’ తో క్రిందికి మార్గం చేసాడు—దాంతో మళ్ళీ ప్రవహించి, గోష్పాద క్షెత్రాన్ని పావనం చేసి, గోవుని బ్రతికించింది! పట్టిసం తో మార్గం చేసిన చోటే ‘పట్టిస క్షేత్రం’. దాన్నే ఇప్పుడు పట్టి సీమ అంటున్నారు!
అక్కడ నించి, గౌతముడి విఙ్ఞప్తి మేరకు ఇతరులు కూడా కలిసి, ఆ గంగని సప్తర్షులూ యేడు పాయలుగా తీసుకెళ్ళి సముద్ర సంగమం చేయించారు! దాంతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారింది!
తరవాత మహానుభావుడు ‘సర్ ఆర్థర్ కాటన్’ బ్యారేజి నిర్మించడం, ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణగా చెయ్యడం—జగద్విదితం!
అదీ సంగతి!
(కృష్ణమ్మ గురించి మరోసారి)

Sunday, August 9, 2009

మ. వి.

జర్నలిస్టులు
మన మీడియా కనిపెట్టిన ‘ముస్లిం సోదరులు’ లా, వీళ్ళది ఓ ప్రత్యేక జాతి!

వీళ్ళు యెక్కడికైనా, యే సమయం లో అయినా, యెప్పుడైనా వెళ్ళవచ్చు—యేమైనా చెయ్యవచ్చు. వీళ్ళకి కూడా ప్రభుత్వం చౌకలో ఇళ్ళస్థలాలు కేటాయించడం లాంటి కొన్ని సదుపాయాలు వున్నాయి!

మన రాజకీయ నాయకులు యెదేదో మాట్లాడేసి, మరో గంటలో మాట మార్చి, ‘నేనన్నదాన్ని వక్రీకరించారు’ అని డబాయించడానికి అవకాశం ఇస్తున్నది వీళ్ళే!

ఇదివరకు జర్నలిస్టులు ఖచ్చితం గా ‘షార్ట్ హాండ్’ నేర్చుకొని, మాట్లాడుతున్నవాళ్ళు మాట్లాడుతూ వుండగానే వ్రాసేసుకొని, దాన్నే రిపోర్ట్ చేసేవారు!

మరిప్పుడో? ప్రెస్ కాన్ ఫరెన్స్ కి పిలిస్తే (పెన్నులూ, పుస్తకాలూ, జీడిపప్పు పలహారాలూ, కూల్ డ్రింకులూ, కొండొకచో హాట్ డ్రింకులూ అనివార్యం గా సరఫరా చెయ్యబడతాయి) చెపుతున్నది వింటారు—కానీ వ్రాసుకోరు! (విన్నవి కూడా ఈ చెవులోంచి ఆ చెవులోకే ప్రయాణిస్తాయి అంతే!) చివరికి మొదటి నించీ గబగబా బరికేస్తున్న ఉత్సాహవంతుడైన ఓ యువ జర్నలిస్ట్ ని అసలు విషయమేమిటి అని అడిగి, వాళ్ళకర్థమయిందాన్ని ఓ పది పన్నెండు పడికట్టు పదాలతో అల్లేసి, రిపోర్టు చేసేస్తారు!

వీళ్ళలో ప్రముఖ పత్రికలకి పనిచేసేవాళ్ళూ, చిన్నా చితకా పత్రికలకి పనిచేసేవాళ్ళూ అంటూ మినహాయింపులేమీ వుండవు!

ఉదాహరణకి, మొన్న 6, 7 తేదీలలో బ్యాంకు వుద్యోగులందరూ తమ దీర్ఘకాలం గా అపరిష్కృతం గా వున్న కోర్కెల సాధనకై సమ్మె చేసారు!

దీని గురించి ప్రముఖ దిన పత్రిక ‘ఈనాడు ‘ విలేఖర్ల రిపోర్టులు ఇలా వున్నాయి—

మెయిన్ పేపరులో, సమ్మె ప్రకటించారనీ, సమ్మె చేస్తున్నారు అనీ, వాళ్ళ కోరికలూ—ఇలా కథనాలు వెలువరిస్తూనే వున్నారు—6 వ తారీఖున దేశవ్యాప్తం గా బ్యాంకులు మూతపడ్డాయి అని కూడా ప్రచురించారు!

మరి జిల్లా పేపరులో—ఒక ప్రాంత విలేఖరి—బ్యాంకు వుద్యోగులు ‘బంద్’ పాటించి, అన్ని బ్యాంకులనీ మూయించేశారు—అని వ్రాశాడు!

జిల్లా ముఖ్య పట్టణం లోని ఐ సీ ఐ సీ ఐ బ్యాంకుముందు ప్రదర్శన నిర్వహిస్తున్న వుద్యోగుల ఫోటో వేసి, ‘అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం’ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నట్టు యూనియన్ నాయకులు ప్రకటించారని ఆ విలేఖరి వ్రాశాడు. (అక్కడ ప్రచురించిన చిత్రంలో పెద్ద పెద్ద అక్షరాలతో ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ అని వ్రాయబడిన బ్యానర్ స్పష్టం గా కనిపిస్తోంది!)

సమ్మె తరవాత, కోర్కెల గురించి చర్చిస్తామనో యేదో హామీ ఇచ్చారు అని వ్రాసిన వార్తలో కూడా, ఇలాగే ప్రచురించారు!

ఇలా అయితే యెలా!