Sunday, August 9, 2009

మ. వి.

జర్నలిస్టులు
మన మీడియా కనిపెట్టిన ‘ముస్లిం సోదరులు’ లా, వీళ్ళది ఓ ప్రత్యేక జాతి!

వీళ్ళు యెక్కడికైనా, యే సమయం లో అయినా, యెప్పుడైనా వెళ్ళవచ్చు—యేమైనా చెయ్యవచ్చు. వీళ్ళకి కూడా ప్రభుత్వం చౌకలో ఇళ్ళస్థలాలు కేటాయించడం లాంటి కొన్ని సదుపాయాలు వున్నాయి!

మన రాజకీయ నాయకులు యెదేదో మాట్లాడేసి, మరో గంటలో మాట మార్చి, ‘నేనన్నదాన్ని వక్రీకరించారు’ అని డబాయించడానికి అవకాశం ఇస్తున్నది వీళ్ళే!

ఇదివరకు జర్నలిస్టులు ఖచ్చితం గా ‘షార్ట్ హాండ్’ నేర్చుకొని, మాట్లాడుతున్నవాళ్ళు మాట్లాడుతూ వుండగానే వ్రాసేసుకొని, దాన్నే రిపోర్ట్ చేసేవారు!

మరిప్పుడో? ప్రెస్ కాన్ ఫరెన్స్ కి పిలిస్తే (పెన్నులూ, పుస్తకాలూ, జీడిపప్పు పలహారాలూ, కూల్ డ్రింకులూ, కొండొకచో హాట్ డ్రింకులూ అనివార్యం గా సరఫరా చెయ్యబడతాయి) చెపుతున్నది వింటారు—కానీ వ్రాసుకోరు! (విన్నవి కూడా ఈ చెవులోంచి ఆ చెవులోకే ప్రయాణిస్తాయి అంతే!) చివరికి మొదటి నించీ గబగబా బరికేస్తున్న ఉత్సాహవంతుడైన ఓ యువ జర్నలిస్ట్ ని అసలు విషయమేమిటి అని అడిగి, వాళ్ళకర్థమయిందాన్ని ఓ పది పన్నెండు పడికట్టు పదాలతో అల్లేసి, రిపోర్టు చేసేస్తారు!

వీళ్ళలో ప్రముఖ పత్రికలకి పనిచేసేవాళ్ళూ, చిన్నా చితకా పత్రికలకి పనిచేసేవాళ్ళూ అంటూ మినహాయింపులేమీ వుండవు!

ఉదాహరణకి, మొన్న 6, 7 తేదీలలో బ్యాంకు వుద్యోగులందరూ తమ దీర్ఘకాలం గా అపరిష్కృతం గా వున్న కోర్కెల సాధనకై సమ్మె చేసారు!

దీని గురించి ప్రముఖ దిన పత్రిక ‘ఈనాడు ‘ విలేఖర్ల రిపోర్టులు ఇలా వున్నాయి—

మెయిన్ పేపరులో, సమ్మె ప్రకటించారనీ, సమ్మె చేస్తున్నారు అనీ, వాళ్ళ కోరికలూ—ఇలా కథనాలు వెలువరిస్తూనే వున్నారు—6 వ తారీఖున దేశవ్యాప్తం గా బ్యాంకులు మూతపడ్డాయి అని కూడా ప్రచురించారు!

మరి జిల్లా పేపరులో—ఒక ప్రాంత విలేఖరి—బ్యాంకు వుద్యోగులు ‘బంద్’ పాటించి, అన్ని బ్యాంకులనీ మూయించేశారు—అని వ్రాశాడు!

జిల్లా ముఖ్య పట్టణం లోని ఐ సీ ఐ సీ ఐ బ్యాంకుముందు ప్రదర్శన నిర్వహిస్తున్న వుద్యోగుల ఫోటో వేసి, ‘అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం’ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నట్టు యూనియన్ నాయకులు ప్రకటించారని ఆ విలేఖరి వ్రాశాడు. (అక్కడ ప్రచురించిన చిత్రంలో పెద్ద పెద్ద అక్షరాలతో ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ అని వ్రాయబడిన బ్యానర్ స్పష్టం గా కనిపిస్తోంది!)

సమ్మె తరవాత, కోర్కెల గురించి చర్చిస్తామనో యేదో హామీ ఇచ్చారు అని వ్రాసిన వార్తలో కూడా, ఇలాగే ప్రచురించారు!

ఇలా అయితే యెలా!




No comments: