"స్వాప్" లు
ఈ మధ్య జింబాబ్వే లో ద్రవ్యోల్బణం వల్ల--వీధి చివర కొట్లో బటాణీలు కొనుక్కోడానికి, తన రెండుచేతులనిండా తన గడ్డం యెత్తువరకూ--తాను మోయలేకపోతున్నన్ని డబ్బుల కట్టల్ని మోసుకొంటూ వెళుతున్న యేడెనిమిదేళ్ళ పిల్ల ఫోటోలు, వాళ్ళ 50 మిలియన్ డాలర్ల నోటు--ఇలా కొన్ని ఫోటోలు అంతర్జాలం లో ఈమెయిళ్ళలో ప్రయాణించాయి--మీరు చూసే వుంటారు.
మరి అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం యేమి చేస్తోంది?
కొన్ని పెద్ద దేశాలు--ఐక్యరాజ్య సమితి ఆదేశాలవల్లో, ప్రపంచ బ్యాంకు చెప్పినందువల్లో, అలాంటి దేశాలకి కొన్ని కోట్ల డాలర్లు ఋణాలు మంజూరు చేశాయి అనుకుందాం. అలా చాలా చిన్న దేశాలకి అప్పులిచ్చారనుకుందాం.
ద్రవ్యోల్బణం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, ఇక ఈ జన్మలో అలాంటి ఋణాలు వసూలు అవవు అని ఓ నిశ్చయానికి వచ్చేస్తాయి ఆ పెద్ద దేశాలు!
అప్పుడు ఓ అంతర్జాతీయ సంస్థ ఓ పెద్ద దేశపు ప్రభుత్వాన్ని సంప్రదించి, 'మీరు ఫలానా ఫలానా దేశాలకి ఇచ్చిన అప్పులు వసూలవవు అని నిశ్చయించుకున్నారుకదా, వాటిని మాకు అమ్మెయ్యండి--ఒక డాలరుకి మీకు 15 సెంట్లు మా సంస్థ చెల్లిస్తుంది ' అని బేరం పెడతారు.
ఆ దేశం, చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకొని, వాళ్ళతో ఒప్పందానికి వచ్చేస్తుంది!
అప్పుడు ఆ సంస్థ, ఆయా పేద దేశాల దగ్గరకి వెళ్ళి, మీ అప్పులు మొత్తం వసూలు చేసుకొనే హక్కులు మాకు వచ్చాయి, మీరుగనక డాలరుకి 25 సెంట్లు మాకు చెల్లిస్తే, ఆ ఋణాలన్నీ రద్దు చేసేస్తాం--కానీ--దీనికి ప్రతిగా--మీ బీచిలదగ్గరా, కొండలదగ్గరా, అడవుల్లోనూ--ఇన్ని వేల యెకరాలు మాకు రాసివ్వాలి' అని బేరం పెడతాయి. (సహజం గా ఆ భూములు టూరిస్టు స్పాట్ లో, గనులో, బోళ్ళు కలపా, ఇతర వాణిజ్యపరమైన వుత్పత్తులు యెక్కువగా జరగడానికి అనువైన స్థలాలో అయి వుంటాయి!) (ఇలాంటి బేరాలకోసం ఆ ప్రభుత్వం లో ఓ ప్రముఖ మంత్రినో, రాజుగారి అల్లుణ్ణో, సక్రమ/అక్రమ సంతానాల్లో ఒకణ్ణో పట్టుకొని, ఓ పెద్దమొత్తం లంచం ఇస్తారు!)
ఇలాంటి వొప్పందాలవల్ల, కొన్ని కోట్ల విలువైన భూములు దక్కడమే కాకుండా, వీళ్ళ దగ్గర వసూలు చేసే దానికి, వాళ్ళకి చెల్లించేదానికీ తేడా--డాలరుకి 10 సెంట్లు--కూడా వాళ్ళకి లాభమే!
ఇలాంటివాటిని "ఈక్విటీ-డెట్ స్వాప్" లు అంటారు.
మన గాలి, జగన్లు ఇంకా ఇలాంటివి ప్రయత్నించినట్టులేదు! (మనీలాండరింగ్ తో సరిపెట్టారు!)
ఆ దేశాలు అదృష్టవంతులు!
No comments:
Post a Comment