Thursday, May 21, 2009

తాజా వార్త

……….యేమిటంటే, మన కళైఙ్గర్ ‘మీ మంత్రివర్గం లో మేము చేరం పొండి’ అని చెప్పేశాడుట! (తను అడిగినన్ని మంత్రి పదవులు ఇవ్వలేమన్నారు కాబట్టి—అని పండితుల విశ్లేషణ!)

పాపం ఆంధ్రావాళ్ళు క్రితంసారి తొంబలుగా ఎంపీలని గెలిపించినా, ఒక్క కేబినెట్ మంత్రి పదవీ ఇవ్వలేదు, ఈ సారైనా ఒకటో రెండో ఇవ్వకపోతే, రాశ్శేఖర్రెడ్డి రాష్ట్ర ప్రజలకి ముఖం చూపించలేడు—మూడోసారి నెగ్గడం అనుమానమైపోతుందేమో అని సోనియా, “కరుణాజీ, మీరడిగిన ‘తొమ్మిది’ కాదు, మరో మాట చెప్పండి” అని అడిగి వుంటుంది.

మరి తమిళ ఆత్మగౌరవం యేమవ్వాలి? “ఇస్తే తొమ్మిదీ ఇవ్వండి, మేమడిగినవే ఇవ్వండి—లేకపోతే లేదు” అని తెగేసి చెప్పి, “మేమసలు మంత్రివర్గం లో చేరం!” అని ప్రకటించేశాడు కరుణ!

చూద్దాం, ఈ బింకాలు యెన్ని గంటలపాటు వుంటాయో!

మన రాశ్శేఖర్రెడ్డి యెంతవరకూ ‘ఆత్మగౌరవాన్ని’ నిలబెట్టుకొని, తెలుగువాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడతాడో!

సెన్సెక్స్ ఓ పెరిగిపోతోంది! మళ్ళీ ‘రియల్’ బూ ం (మన రాష్ట్రం లో) వచ్చినా రావచ్చు! భూములెలాగూ మిగల్లేదు, అసెంబ్లీ హాలూ, జూబిలీ హాలూ, రవీంద్ర భారతి, హుస్సేన్ సాగరూ, పబ్లిక్ గార్డెన్సూ అయినా మిగులుతాయో, పందేరం చేసేస్తారో! చూడాలి!

యేమైనా, మన ‘చిరు’ చేసింది చిరు తప్పిదం కాదనీ, ‘చారిత్రాత్మక తప్పిదం’ అనీ అనిపించడం లేదూ?

మన జేపీ మరో ‘లోక్ నాయక్’ అయితే యెంత బాగుండును!—అనిపించడంలేదూ?

ఆలోచించండి!

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చారిత్రాత్మక తప్పిదం పేటెంట్ హక్కు ఎర్రసోదరులదే ఇంకెవ్వరూ వాడుకోవడానికి వీళ్ళేదు,వాడినవారు చట్టరీత్యా శిక్షార్హులు

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయ మోహన్!

ఈ సారి ఎర్రసోదరులే వాళ్ళ పేటెంట్ హక్కుని వదులుకోడానికి సిద్ధమై, 'మళ్ళీ చారిత్రక తప్పిదం చెయ్యడానికి మేం సిద్ధం గా లేం!' అని కలలు కని, యేర్పాట్లు కూడా చేసుకున్నారు! (అవసరమైతే బుద్ధదేబ్ నో, ఇంకా అవసరమైతే జ్యోతి బసు నో, కారత్ నో, వృందా కారత్ నో, చివరాఖరకి సీతారాం యేచూరినైనాసరే ప్రథాని పీఠం యెక్కించడానికి మేం సిద్ధం--అని ప్రకటించేశారు!)

ఇంకెక్కడి పేటెంట్!

అందుకే మన చిరు దాన్ని సంగ్రహించాడంటాను! (తను కూడా 'పెద్ద ' సమ్మర్ కేంప్ సిద్ధం చేసుకున్నాడట--గెలిచిన ఎమ్మెల్యేలని 'ఖుషీ' చేసి, పారిపోకుండా కాపాడుకోడానికి!--16వ తేదీ సాయంత్రమే దాని బుక్కింగ్ కేన్సిల్ కూడా చేయించాడట!)

ఇప్పుడేమంటారు?