Sunday, February 1, 2009

మూడేం ఖర్మ? మూడొందల తొంభయ్యారు!


తాజాగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకి పాకేజ్ ఇస్తానంటాడు మన ప్రధాన/ఆర్ధిక మంత్రి. రిజర్వ్ బ్యాంక్ గవర్నరు! (వెనకాల హోం మంత్రి ప్రోద్బలం చాలా వున్నట్టుంది!)

(ఈ అరవ్వాళ్ళేకదా గోవిందా ఎంటర్ ప్రైజెస్ లాంటివి స్థాపించి మన తెలుగోళ్ళ నెత్తిన చెంగేసింది? ఈ రోజుక్కూడా, 'మళ్ళప్పురం ఫైనాన్స్ 'లాంటి పేర్లతో 'మీ బంగారం తనఖాపై నూటికి నూరు శాతం ఫైనాన్స్ ' అని ప్రకటనలిస్తున్నది? రేప్పొద్దున్న, బంగారం రేటు పెరిగిన తర్వాత, వాళ్ళు మాయం అయిపోతే, మన బంగారానికి దిక్కెవరు?)

మన ఆర్ధిక వ్యవస్థ కి పట్టిన గ్రహణం—ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ, తామరతంపరగా వెలసిన ‘మైక్రో ఫైనాన్స్ ‘ కంపెనీలూ! ఇంకా, మ్యూచువల్ (వెఱ్ఱి వెఱ్ఱి) ఫండ్సూ!

వీటికి తోడు, బ్యాంకులూ! మహిళా సంఘాలకి లక్షలు లక్షలు అప్పులు ఇచ్చేస్తున్నాయి!
‘మన మహిళలందరూ లక్షాధికారులు కావాలి—పావలా వడ్డీ తో’ అనే మన ముఖ్య మంత్రీ!

మొన్నొకరోజు, పొద్దున్నే మా యింటిదగ్గరున్న కిరాణా కొట్టుకి వెళితే, దగ్గర్లో వున్న గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అడుక్కొనే చింపిరిజుట్టు మహిళ, చంకలో యేడాది బిడ్డతో, జాకెట్లోంచి ఓ మురికిపట్టిన నలిగిన పదిరూపాయల నోటు తీసి ఇచ్చి ‘ఓ క్లినిక్ ఆల్ క్లియర్ డబ్బా ఇవ్వండి’ అంది దుకాణదారుని!

ఆసక్తి చంపుకోలేక అడిగాను, ‘అమ్మా! నీకు చింపిరి జుట్టు లేకపోతే, యెవరు ముష్టి వేస్తారు?’ అని!

నన్ను గుర్తించినట్టుంది—“బాబుగారూ! మీరా! ఇవాళా, రేపు నాకు సెలవిచ్చేశారండి! (సంఘం వాళ్ళు) చక్కగా తయారయి, మా ఆయనా, పిల్లలతో, సినిమాకి వెళ్ళి, హోటల్లో భోజనంచేసి, ఇంటికి వెళ్తానండి! మీకు తెలియందేముందండి బాబుగారూ! చింపిరి జుట్టంటారా? యెంతసేపొస్తుంది—జుట్టు విప్పి రోడ్డు మీద రెండు సార్లు పొర్లాడితే!”

భారత దేశం బీదది అనే దమ్ము యెవరికుంది?

"స్లం డాగ్ మిలియనీర్" కి ఇన్ని అవార్డ్ లు యెందుకు వస్తున్నాయి? (అరిందం చౌదరి సరిగ్గా తన అక్కసు వెళ్ళగక్కలేకపోతున్నాడు!)

No comments: