Sunday, November 9, 2008

వడ్డీ రేట్లు

పీ. యల్. ఆర్.

బ్యాంకురేటు యెత్తెయ్యగానే, బ్యాంకులకి యేం చెయ్యాలో పాలుపోలేదు. అందుకని ‘ప్రైం లెండింగ్ రేటు ' అని ప్రవేశ పెట్టాయి!

ఇదో విచిత్రమైన ప్రక్రియ!

ఎందుకంటే, ఇది శంఖంలో పోసిన తీర్థం కాదు! ప్రతీ బ్యాంక్, తన ఇష్టం వచ్చినట్టు దీన్ని పెట్టుకో వచ్చు!
సరే. అప్పు తీసుకునే వాళ్ళ దగ్గర వ్రాయించుకునే ప్రామిసరీ నోట్ల మీద ఇదివరకు—“రిజర్వ్ బ్యాంకు రేటు మీద ‘ఇంత’ శాతం యెక్కువ లేదా తక్కువ వడ్డీ తో ఈ అప్పు తిరిగి చెల్లిస్తాను” అని వ్రాయిoచుకునేవారు.

ఈ ప్రోనోట్లలో, ‘రిజర్వ్ బ్యంక్ రేటు’ అనే మాట స్థానంలో, పీ. యల్. ఆర్. ని చొప్పించాయి! (జడ్జీలకి కాస్త బ్యాంకింగ్ అవగాహన వుంటే, బ్యాంకులని దీని ఆధారంగా ముప్పు తిప్పలు పెట్టచ్చు!—నేనింకా సర్వీసులో వుండడంవల్ల ఇంతకన్నా యెక్కువ వివరణ ఇవ్వలేను)

ఇక పీ. యల్. ఆర్. తో ప్రారంభమయ్యాయి కష్టాలు!

ఇది ఇప్పటికి యెన్ని అవతారాలు యెత్తిందంటే, నేను చెప్పలేను….ఒక్కో బ్యాంకు ఒక్కోలాగ, ‘ప్రైమరీ’ ‘సెకండరీ’ ‘స్టాండర్డ్’ ‘షార్ట్ టెర్మ్’ ‘లాంగ్ టెర్మ్’ ‘మిడిల్ టెర్మ్’—ఇలా!

చివరికి, ప్రజలకీ, మీడియాకి చెప్పడానికి—‘బెంచ్ మార్క్ పీ. యల్. ఆర్’ని కనిపెట్టాయి!

(మీరు గమనిస్తే, మీరు వ్రాస్తున్న ప్రోనోట్ మీద ‘……% ఏబవ్/బిలో ది బీఎంపీఎల్లార్/ఎస్టీపీఎల్లార్/ఎల్టీపీఎల్లార్…….’ ఇలా ప్రింటు చెయ్యబడి వుంటుంది—అనవసరమైనవాటిని కొట్టేసి, అవసరమైనదానినే వుంచుకునేలాగ.)

ఇప్పుడు బెంచ్ మార్క్ పీయల్లార్నే, అప్పుడప్పుడూ, అర శాతమో పావు శాతమో, పెంచడమో, తగ్గించడమో చేస్తున్నాయి—చిదంబరంగారు చెప్పగానే!

దీనివల్ల యెవరికేమి వొరిగింది? ఈ రేటు తగ్గితే, అది ఎఫెక్ట్ చేసిన రోజునించీ ఋణాలు తీసుకునే వారికే వర్తిస్తుంది!—ఫిక్సెడ్ రేటు తీసుకున్నవాళ్ళకెవరికీ వర్తించదు.

ఇక ‘ఫ్లోటింగ్’ రేటు తీసుకున్నవాళ్ళకి, ఇదివరకు 7-8 శాతం వడ్డీ కి తీసుకున్నవాళ్ళూ, ఫ్లోటింగులో ఇప్పటికి 14 శాతానికి చేరారుకదా, వాళ్ళకి ఓ అరో, పావో శాతం తగ్గితే వచ్చే ఉపశమనం యెంత?

అదండీ సంగతి!

Friday, November 7, 2008

"బ్యాంక్ రేటు....."


ఈ బ్యాంకురేటు అంటే ‘శంఖంలో పోసిన తీర్థం’!

ఎందుకంటే, ఈ బ్యాంకు రేటు ని యెప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంకు ప్రకటిస్తూ వుండేది! అది అఫీషియల్ మరియూ పబ్లిక్ రికార్డు.

ఫలానా రోజు బ్యాంకు రేటెంత? అంటే చిన్న పిల్లవాడు సహితం చెప్పగలిగేవాడు!

తరవాత, ఓ ఫైన్ మార్నింగ్ రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వాదేశాలకనుగుణంగా, ఈ బ్యాంకు రేటుని రద్దు చెయ్యడమే కాకుండా, వడ్డీ రేట్ల వ్యవహారంలో బ్యాంకులకి పూర్తి స్వేచ్చ నిచ్చింది.

అంతే కాకుండా, బ్యాంకులు శాఖల్ని ప్రారంభించాలంటే ఇది వరకు రిజర్వ్ బ్యాంకు అనుమతి కావాలనే నిబంధనని యెత్తివేసింది!

(ఈ నిబంధన పుట్టు పూర్వోత్తరాలలోకి వెళితే, పట్టణ ప్రాంతాల్లోనే బ్యాంకులు శాఖల్ని యేర్పాటు చేస్తూండటం,‘అన్ బ్యాంక్డ్ ఏరియాలు’, ‘సర్వీస్ ఏరియా అప్రోచ్’ మొదలైన అనేక విషయాలు చాలా ఉన్నాయి!),

తరవాతేమయిందంటే……..?

Thursday, November 6, 2008

రిజర్వ్ బ్యాంక్ రేటు

కొన్ని (పదుల?) సంవత్సరాలక్రితం, ‘బ్యాంక్ రేట్’ అని ఒకటుండేది.
అంటే బ్యాంకులు ‘డిస్కౌంట్’ చేసిన బిల్లులని {బిల్లులంటే, అప్పట్లో సైటు బిల్లులు అని వుండేవి లెండి—"ఈ బిల్లుని మేము చూసిన తరవాత ‘ఇన్ని’ నెలలలోగా, మీ బిల్లుని ఆనర్ చేస్తాము"…అంటే మీరు చెప్పిన మొత్తం, మీరు చెప్పిన వడ్డీ తొ సహా, (లేక వడ్డీ లేకుండా) చెల్లిస్తాము. మేము దీనికి ‘అంగీకరిస్తున్నాము’ (ఆక్సెప్టెన్స్) అని ‘డ్రాయీ’ సంతకంచేసేవారు.}.

ఇలాంటి బిల్లుల్ని రిజర్వ్ బ్యాంకు ‘రీడిస్కౌంట్’ చేసుకొని, బ్యాంకులకి ఆ మొత్తాలు చెల్లించేది….ఆ డబ్బుతో, బ్యాంకులు మరిన్ని బిల్లుల్ని డిస్కౌంట్ చేసేవి!

అయితే, బ్యాంకులు, మాటవరసకి 10% డిస్కౌంట్ తీసుకొంటే, రిజర్వు బ్యాంకు దాని మీదో ఒకటో, ఒకటిన్నరో శాతం ఎక్కువ కి ‘రీడిస్కౌంట్’ చేసేది….అంటే, బ్యాంకు రేటు 11.00% లేక 11.50% అన్నమాట.

బ్యాంకులు ఈ బ్యాంకు రేట్ ని ఆధారంగా తీసుకుని, తమ మిగిలిన ఆస్థులకి (అంటే ప్రజలు తీసుకునే అప్పులు) ‘బ్యాంక్ రేట్ పై ‘ఇంత’ శాతం అధికంగా….అని చెప్పుకుంటూ, వడ్డీ వసూలు చేసేవి.

అదీ బ్యాంక్ రేటంటే.

మరి దీని గొప్పేమిటట?

వస్తానక్కడికే!

Monday, November 3, 2008

మరో 85,000 కోట్లు!


మొన్న శుక్రవారం కాకుండా అంతకు ముందు శుక్రవారం అనుకుంటా—అదే సెన్సెక్స్ పడిపోయినప్పుడు—రెండ్రోజుల్లో సిమెంటు, ఉక్కు ధరలు సగానికి సగం పడిపోయాయట!

అలా పడిపోతే, సామాన్యుడికి మేలు జరగడం అటుంచి, ఆ కంపెనీలకి లాభాలు తగ్గిపోవడం లేదూ? (గమనించండి సరిగ్గా—నష్టాలు రావడంలేదు….లాభాలు ‘తగ్గి’ పోతున్నాయి!)

మళ్ళీ నిన్న, రిజర్వు బ్యాంక్ రెపో రేటుని తగ్గించీ, ఎస్.ఎల్.ఆర్ ని తగ్గించీ, మరో 85,000 కోట్లు ఆర్ధిక వ్యవస్థ లోకి వదులుతోంది!

వెంటనే మీడియా లో ‘గత కొన్ని రోజులుగా వడ్డీల భారంతో సతమతమౌతున్న సామాన్యుడికి గొప్ప ఉపశమనం’ అంటూ కధనాలు!

క్రితం సారి సీఆరార్ పెంచగానే, బ్యాంకులు తమ పీఎల్లార్ పెంచుకుంటే, విత్త మంత్రిగారు ఏమి చెప్పారు? ‘మీరెంతైనా పెంచుకోండి గానీ, 35,00,000/- పైబడిన గృహ, విద్యా ఋణాలకే పెంచుకోండి’ అని!

సరే, బ్యాంకులూ వెంటనే తలూపాయి.

అసలు 34,00,000/- గృహ/విద్యా ఋణాలు తీసుకునే ఆ తలకు మాసిన సామాన్యుడెవడండీ?

సామాన్యుడెవడైనా, అప్పు కావాలంటే, ముందు గుర్తొచ్చేది బంగారం. ఆ తరవాత తన జీతం! బ్యాంకు కి వెళ్ళి, బంగారం తాకట్టు పెట్టుకొనో, లేదా ‘నా జీతంలో నెల నెలా తెగ్గోసుకుందురుగాని’ అనో అప్పుకి ప్రాధేయపడతాడు తప్ప, అవసరం వెయ్యో పదివేలో అయితే, ‘ఇల్లు కట్టుకుంటాను—ఓ ముప్ఫై లక్షలివ్వండి’ అనో, ‘చదువుకుంటాను—ఓ పాతిక లక్షలివ్వండి’ అనో కాదుగా?

మరి ఈ లక్షల కోట్ల విదుదల తో సామాన్యుడికి ఒరుగుతున్నదేమిటి?

సరిగ్గా యేడాది క్రితం కిలో 16 రూపాయలున్న సోనా మసూరి బియ్యం, ఏ రోజు 27 నించి 30 రూపాయలా? పైగా ‘వారంలో ద్రవ్యోల్బణం రేటు 0.1 శాతం తగ్గింది! ఇక ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అని చంకలు గుద్దుకోవడమా!

ఇదేం వ్యవస్థ?

బ్యాంకులని ‘వడ్డీ రేట్లు తగ్గిస్తారా?’ అని మీడియా ప్రశ్నలు!

వాటి సమధానం “వచ్చే వారంలో మా ‘ఆల్కో’ సమావేశం తరవాత నిర్ణయం తీసుకుంటాము” అని.

ఈ ‘ఆల్కో’ అంటే, ‘ఎస్సెట్ లయబిలిటీ మేనేజ్ మెంట్ కమిటీ’ అని ప్రతీ బ్యాంకూ శ్రీ నరసిం హం కమిటీ తరవాత యేర్పాటు చేసుకున్నాయి! ఇదంతా ఓ పెద్ద ఫార్సు!

ఈ ఆల్కోలు చెప్పేవాటిని బ్యాంకు సీయండీలే తీసి పారేస్తారు!

యెందుకంటే, ప్రపంచంలో ఎప్పుడు ఏ మనిషికి ఏ క్షణంలో, యెంత ‘డబ్బు’ అవసరం అవుతుందో ఆ బ్రహ్మ దేవుడు కూడా చెప్పలేడు కాబట్టి!

Sunday, November 2, 2008

శ్రీ భోగరాజు!

దేశ భక్తితోపాటు, దేశానిక్కావలసినదేమిటో ముందుగాచూడగలిగిన ‘ద్రష్ట’ (విజనరీ) శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య అనే ఓ నియోగి బ్రాహ్మడు.

“పట్టాభి ఓటమి నా ఓటమి” అని మహాత్మా గాంధీ చేత అనిపించిన దిట్ట.

ఆ రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి (రాష్ట్రం ఇంకా రాకపోయినా) కావలసినవేమిటి? అని ఆలోచించి—ఆంధ్రా బ్యాంకు, ఆంధ్రా ఇన్స్యూరెన్స్, ఆంధ్రా ఇంజనీరింగ్, ఆంధ్రా సైంటిఫిక్, భారతలక్ష్మీ బ్యాంక్—కంపెనీలు స్థాపించిన వ్యాపారవేత్త!

ఆయన బ్యాంకింగ్ బుఱ్ఱ యెలాంటిదంటే—

ఓ సారి ఆయన స్నేహితుడు ఒకాయన అత్యవసరమై ఆయన దగ్గరకి అప్పు కోసం వచ్చి, ‘ఒరే! ఓ పదివేలు సర్దు! నెల తిరిగేలోగా పువ్వుల్లోపెట్టి తిరిగి ఇచ్చేస్తాను! నా సంగతి తెలుసుగా?—అసలు ఈ మాత్రానికి నీదగ్గరకెందుకులే అని మన శెట్టి దగ్గరకే వెళ్ళి అడిగాను—కానీ నెలకి రూపాయి వడ్డీకి తక్కువ ఇవ్వడట! అందుకే…..’ అన్నాడు.

ఆయన నవ్వుతూ, ‘మరి నాకయితే ఎంత వడ్డీ ఇద్దామనుకొంటున్నావు?’ అనడిగారు.

‘మామూలుగా ముప్పావలా ఇస్తాను’ అన్నాడు స్నేహితుడు.

‘సరే’ అంటూ లోపలకి వెళ్ళి వచ్చి, ఓ పాతిక రూపాయలు స్నేహితుడి చేతిలో పెట్టి, ‘యెలాగూ నెలలో ఖచ్చితంగా తీర్చేస్తావు కాబట్టి, వడ్డీ తేడా పాతిక రూపాయలేగా! ఆది నేనిచ్చేస్తున్నాను. అప్పు మాత్రం శెట్టి దగ్గరే తీసుకో! నీ పనీ గడుస్తుంది, మన స్నేహమూ నిలబడుతుంది’ అన్నాడు.

అదీ బ్యాంకరు బుఱ్ఱంటే!