శ్రీ భోగరాజు!
దేశ భక్తితోపాటు, దేశానిక్కావలసినదేమిటో ముందుగాచూడగలిగిన ‘ద్రష్ట’ (విజనరీ) శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య అనే ఓ నియోగి బ్రాహ్మడు.
“పట్టాభి ఓటమి నా ఓటమి” అని మహాత్మా గాంధీ చేత అనిపించిన దిట్ట.
ఆ రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి (రాష్ట్రం ఇంకా రాకపోయినా) కావలసినవేమిటి? అని ఆలోచించి—ఆంధ్రా బ్యాంకు, ఆంధ్రా ఇన్స్యూరెన్స్, ఆంధ్రా ఇంజనీరింగ్, ఆంధ్రా సైంటిఫిక్, భారతలక్ష్మీ బ్యాంక్—కంపెనీలు స్థాపించిన వ్యాపారవేత్త!
ఆయన బ్యాంకింగ్ బుఱ్ఱ యెలాంటిదంటే—
ఓ సారి ఆయన స్నేహితుడు ఒకాయన అత్యవసరమై ఆయన దగ్గరకి అప్పు కోసం వచ్చి, ‘ఒరే! ఓ పదివేలు సర్దు! నెల తిరిగేలోగా పువ్వుల్లోపెట్టి తిరిగి ఇచ్చేస్తాను! నా సంగతి తెలుసుగా?—అసలు ఈ మాత్రానికి నీదగ్గరకెందుకులే అని మన శెట్టి దగ్గరకే వెళ్ళి అడిగాను—కానీ నెలకి రూపాయి వడ్డీకి తక్కువ ఇవ్వడట! అందుకే…..’ అన్నాడు.
ఆయన నవ్వుతూ, ‘మరి నాకయితే ఎంత వడ్డీ ఇద్దామనుకొంటున్నావు?’ అనడిగారు.
‘మామూలుగా ముప్పావలా ఇస్తాను’ అన్నాడు స్నేహితుడు.
‘సరే’ అంటూ లోపలకి వెళ్ళి వచ్చి, ఓ పాతిక రూపాయలు స్నేహితుడి చేతిలో పెట్టి, ‘యెలాగూ నెలలో ఖచ్చితంగా తీర్చేస్తావు కాబట్టి, వడ్డీ తేడా పాతిక రూపాయలేగా! ఆది నేనిచ్చేస్తున్నాను. అప్పు మాత్రం శెట్టి దగ్గరే తీసుకో! నీ పనీ గడుస్తుంది, మన స్నేహమూ నిలబడుతుంది’ అన్నాడు.
అదీ బ్యాంకరు బుఱ్ఱంటే!
No comments:
Post a Comment