Friday, February 27, 2009

వృద్ధి

మన బ్యాంకులు దివాళా యెత్తకుండా మన పెద్దలు తీసుకున్న జాగ్రత్తల్లో కొన్ని—సీ ఆర్ ఆర్, ఎస్ ఎల్ ఆర్, బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్—ఇలాంటివి

వీటిగురించి స్థూలం గా చెప్పుకొంటే—

ముఖ్యంగా బ్యాంకులు ప్రజల దగ్గరనించి డిపాజిట్ల రూపం లో సేకరించిన నిధుల్లో, ఖచ్చితంగా ఇంత శాతం అని, ‘నగదు రూపం లో’ రిజర్వ్ బ్యాంకు దగ్గర వుంచాలి. దీన్ని కేష్ రిజర్వ్ రేషియో (సీ ఆర్ ఆర్) అంటారు.

తరవాత, యెప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకోవడానికి వీలుగా, ఇంకొంత శాతం సెక్యూరిటీల రూపం లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిలవ వుంచాలి. దీన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ ఎల్ ఆర్) అంటారు.

బ్యాంక్ రేట్ ఇప్పుడు అమల్లో లేదు అనుకున్నాం కదా.

ఇక రిపోజిటరీ అనేదొకటి స్థాపించింది మన రిజర్వ్ బ్యాంక్.

బ్యాంకుల దగ్గర ఎస్ ఎల్ ఆర్ కి కావలసిన దానికన్నా యెక్కువ సెక్యూరిటీలు వుంటే, వాటిని రిపోజిటరీ లో దాఖలు చేసి, నగదు అప్పు తీసుకోవచ్చు. దానికి కొంత వడ్డీ వసూలు చేస్తుంది రిజర్వ్ బ్యాంక్. అదే రెపో రేట్.

సెక్యూరిటిలు తక్కువైతే, నగదు చెల్లించి, సెక్యూరిటీలని అప్పుగా పొందవచ్చు. దీనికీ కొంత వడ్డీ వసూలు చేస్తుంది ఆర్ బీ ఐ. అదే రివర్స్ రెపో రేట్.

సీ ఆర్ ఆర్ నీ, ఎస్ ఎల్ ఆర్ నీ నిలబెట్టుకోడానికి రెపోజిటరీ వెసులుబాటు కల్పిస్తుందన్న మాట.

ఈ రేట్లు తగ్గించడం ద్వారా ఆర్ బీ ఐ కొన్ని వేల కోట్ల నగదు ని బ్యాంకుల కి ఋణాలివ్వడానికి వీలుగా అందుబాటులో వుంచుతోంది!

దాని వల్లే ఋణాల మీద వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ప్రజల డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గి పోయాయి!
మరి కృత్రిమంగా ఇలా వుంచడం అవసరమా?

ద్రవ్యోల్బణం బాగానే తగ్గింది. కానీ ఈ యెన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది ‘వృద్ధి రేటు’ గురించి! అంచనాలు యెనిమిదికీ, యేడుకీ తగ్గి, ఇంకా తగ్గేలా వున్నాయి మరి!

ఈ సందర్భంలో నిన్న యూ ఎస్ అధ్యక్షుడు ఒబామా వాళ్ళ చట్ట సభలో చేసిన ప్రసంగానికి ప్రతిగా, ప్రతిపక్ష హోదాలో శ్రీ బాబీ జిందాల్ ప్రసంగం లోంచి ఈ మాటల్ని గమనించండి.

“మనదగ్గర లేని డబ్బుతో, మనకు అవసరం లేని వస్తువులను కొనడానికి ఋణాలెందుకు తీసుకోవాలి?”

వజ్ర సమానమైన, వజ్ర సదృశం అయిన, వజ్రోపమానమైన—ఇలాంటి విశేషణాలెన్నో వెయ్యదగ్గ మాటలు కావూ ఇవి?

మన ప్రధాన, మాజీవిత్త, తాత్కాలిక విత్త మంత్రులు గమనిస్తున్నారా?

No comments: