స్వర్గానికి నిచ్చెనలు.....
......వేసి, మీకందరికీ జాబిల్లిని అందుబాటులోకి తెస్తామంటున్నాయి మన బ్యాంకులకి వేస్తున్న వెఱ్ఱితలలు.
పల్లె పల్లెలో బ్యాంకింగ్ సేవలని 'విస్తృతంగా' విస్తరింపజేయడానికి, త్వరలో "మైక్రో" (సూక్ష్మ) యే టీ యెం లు పెడతారట!
ఇప్పుడు బ్యాంకులు పల్లెల్లోని కిరాణా కొట్లకీ, పాల కేంద్రాలకీ, పనిలేని వేస్ట్ ఫెలోస్ కే కాకుండా, 'సూక్ష్మ ఋణ సంస్థలకీ', టాటా, రిలయెన్స్, భారతీ లాంటి సంస్థలు 'స్థాపించబోయే' సంస్థలకీ తమ 'బిజినెస్ కరస్పాండెంట్లు ' (బీ సీ లు) గా నియమించుకోడానికి అనుమతి ఇచ్చేశారుగా!
వీళ్ల దగ్గర ఈ యేటీయెం లు పెడతారట! వీటి ద్వారా, పల్లె ప్రజలు తమ "నగదు చెల్లింపు, స్వీకరణ, బదిలీ" లు చెయ్యవచ్చట. ఇంకా, "బీమా పాలసీలు, పింఛను ఖాతా చెల్లింపులు, ఎస్ హెచ్ జీ ల ఋణాలపై వడ్డీ అందచేత, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు" వంటివన్నీ నిర్వహించుకోవచ్చట!
దేశం లోని యేమారుమూల పల్లెకు వీళ్లు వెళ్లినా, అక్కడనించి కూడా లావాదేవీలు నిర్వహించుకోవచ్చట!
(దేశం లో ఇంతవరకూ అన్ని బ్యాంకులూ నిర్వహిస్తున్న లక్షలాది యేటీయెం లలో--'నగదు చెల్లింపు మాత్రమే' జరుగుతోంది! కొన్ని బ్యాంకులు 'చెక్కుల డిపాజిట్', 'నగదు డిపాజిట్' లు నిర్వహిస్తున్నా, నగదు డిపాజిట్ లో సమస్యలు వచ్చి, మానేశాయి. మరి కొన్ని లక్షల ఖర్చుతో యేర్పాటు చేసిన పెద్ద యేటీయేంలు చెయ్యలేని వ్యవహారాలని మైక్రో లు యెలా నిర్వహిస్తాయో!)
"దేశం లోని గృహస్తులందరినీ బ్యాంకింగ్ పరిధి లోకి తేవాలనే లక్ష్యం తో ఆర్బీఐ గత కొంతకాలం గా చేపడుతున్న కార్యక్రమాలకి ఇప్పుడు ఈ సూక్ష్మ యేటీయెం లు యెంతగానో దోహదపడతాయని" బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట! దువ్వూరి సుబ్బారావుగారూ--నమస్కారం!
(ప్రభుత్వమూ--గుత్తేదారులూ--సలహాదారులూ--టెండర్లూ--కోట్లకి కోట్లూ--మామూలే!)
కొసమెరుపేమిటంటే--వీటన్నిటికీ ఆథారం--మన ప్రజా పంపిణీ వ్యవస్థ యెవరికి రేషన్ ఇవ్వదలచుకొన్నారో, వారికి మాత్రమే కేటాయించే "ఆథార్" సంఖ్యా, కార్డులేనట!
మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత వొలకబోసుకోం కదా చివరికి? యేమో!