Tuesday, May 4, 2010

బ్యూరాక్రసీ

మందమైన చర్మం--3

ఎస్ టీ డీ లు వచ్చాక, టెలిగ్రాం విభాగం మూతపడింది.

కొరియర్ల పుణ్యమాని, పోస్ట్ ఆఫీసుల్లో పనిలేకుండా పోయింది. ప్రసాదాలు బట్వాడా తో మొదలు పెట్టి, ఇప్పుడు చింతపండూ, సబ్బులూ, ఉల్లిపాయలూ అమ్ముకునే స్థితికి వచ్చాయి. 

ఇంకా కొన్ని పత్రికలూ, షేర్ బ్రోకర్లూ మొదలైన వాళ్ళవల్ల కొంతమంది పోస్ట్ మేన్ లకి పని దొరుకుతోంది.

ఇక ఇందిరాగాంధీ హయాములోనే, శాం పిట్రోడా పుణ్యమాని, ఎస్ టీ డీ లు ప్రవేశపెట్టబడ్డాయి. రాజీవ్ హయాములో ఇంకా విస్తరించాయి. ప్రైవేటు కాయిన్ బాక్స్ లు వీధికో పదహారు వెలిశాయి (ఏస్ టీ డీ బూత్ లు కాకుండా).

ఉపగ్రహాలు పెరగడం తో ఐ ఎస్ డీ లు కూడా వృధ్ధి చెందాయి.

అలాంటి పరిస్థితుల్లో, పేపర్లో చిన్న చిన్న ప్రకటనలు వెలువడేవి--'ఒంటరితనం ఫీల్ అవుతున్నారా? ఫలనా నెంబరుకి ఫోన్ చెయ్యండి'; 'మీ జాతకం చెబుతాం--ఫలానా నెంబరుకి ఫోన్ చెయ్యండి'--ఇలా!

మా వూళ్ళో ఒకాయన, తన జాతకం కోసం ఆ నెంబరుకి ఫోన్ చేసి, సందేహాలు తీర్చుకున్నాడు. అంతలో టెలిఫోన్ జే యీ గారు ఆయన నెంబరుకి ఫోన్ చేసి, 'ఇప్పటివరకూ మీ ఫోన్ నించి మీరే మాట్లాడారా?--వూరికే నిర్ధారణకి అడుగుతున్నాను' అని పెట్టేశారట. 

తరవాత ఆ కాల్ కి 4 వేల చిల్లర బిల్లు వచ్చేసరికి, మన వాడికి తెలిసింది--జే యీ గారు యెందుకు నిర్ధారణ చేసుకొన్నారో!

ఇలాంటి చమత్కారాల సంగతి యెలా వున్నా, బీ ఎస్ ఎన్ ఎల్ పధ్ధతులు మాత్రం మార లేదు. 

ఇప్పటికీ, ఫోన్ కనెక్షన్ కావాలంటే, వేలు డిపాజిట్ కట్టి, ప్రతీ నెలా అద్దె కూడా కట్టాలి. 

ఇంకా నయం--ఇంతకు ముందు అయితే, ఫోన్ ని ఒక ఆఫీసులో, ఒక గదిలో, ఒక టేబుల్ మీద నించి ఇంకో టేబుల్ మీదకి మార్చాలన్నా, ముందు దరఖాస్తు పెట్టాలి. వాళ్ళు ఖర్చులకి 'ఎస్టిమేట్' వెయ్యాలి. మనం సరిపడా డబ్బు కట్టాలి. ఆ తరవాత ఏ మూడు నాలుగు నెలలకో (మన ఆఫీసు తో వాళ్ళ అవసరాన్నిబట్టి) పని జరిగేది.

చిత్రం యేమిటంటే, ఇప్పటికి కూడా ఆ రూల్స్ మారలేదట! ఇల్లు కట్టించుకున్న ప్రతీవాడు, కరెంటు వైరింగ్ తో పాటు ఫోన్ వైరింగ్ కూడా చేయించుకొని, పాయింట్లు పెట్టించుకొని, వాడుకొంటున్నారు.

మొన్నామధ్య, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిన ఓ పెద్దమనిషి, "ఇంట్లో ఇన్ని 'పేరలల్' కనెక్షన్లు వుండకూడదండీ! ఒక్కటే వాడుకోండి" అని బాధపడిపోయాడు.

'బ్రిటిష్ వాళ్ళకాలం లో వచ్చిన పోస్ట్ స్ అండ్ టెలిగ్రాఫ్స్ ఆక్ట్ ని బంగాళాఖాతం లో యెప్పుడో కలిపేశారుగా?' అంటే, 'అయినా అంతే' అని ఆయన సమాధానం.

......మళ్ళీ ఇంకోసారి.