తెల్ల యేనుగులు
వీటిగురించి ఓ టపాలో వ్రాశాను--వివరణ మరోసారి ఇస్తాను అని.
వీటిలో, 'విజిలెన్స్ కమిషన్ ' ఒకటి (స్టేట్ అయినా, సెంట్రల్ అయినా).
ప్రభుత్వం లో పై అధికారులు/రాజకీయులు గాని, సంస్థల్లో యాజమాన్యాలుగానీ, యేదైనా కుంభకోణమో, ప్రమాదమో జరిగినప్పుడు, యెవరిని బలిపశువులుగా శిలువ వెయ్యాలో ముందే నిర్ణయించుకుని, అప్పుడు విజిలెన్స్ వాళ్ళకి అప్పగిస్తారు.
ఇక అక్కడనించి, యెక్కడలేని రూల్సూ, జీవోలూ, నిబంధనలూ, వివరణలూ అన్నీ నిందితుడిమీద ప్రయోగిస్తారు. అక్కడతో వాడు హరీమంటాడు.
వుదాహరణకి, మొన్నామధ్య 'బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలతో' బ్యాంకులని మోసగించిన కేసులు ఓ జిల్లా మొత్తం మీద కొన్ని వందలు వెలుగు చూశాయి.
ఇప్పుడు విజిలెన్స్ వారు, 'బ్యాంకు అధికారులదే తప్పు--యెందుకంటే, ఆ పొలం వాళ్ళదే అని నిర్ధారణ అయ్యాక, దాని కొలతలు, వేస్తున్న పంట, మొదలైనవన్నీ తణిఖీ చేసి, అప్పుడు మాత్రమే అప్పు ఇవ్వాలి!' అని నిర్ధారించేశారుట.
అసలు ఫోర్జరీలు చేసినవాళ్ళు, తెలిసీ దొంగ పుస్తకాలని తయారు చేసి అమ్ముకున్నవాళ్ళూ, దళారులూ అందరూ బాగానే వుంటారు--మధ్య బ్యాంకు అధికారులు బలి పశువులు.
ఒక బ్యాంకు శాఖలో కొన్ని వేల పంట ఋణాలు వుంటాయి--వాటిలో వివిధ మండలాలూ, గ్రామాలకి చెందిన రైతులూ, భూములూ వుంటాయి. కనాకష్టం గా ఓ రెండువందలే ఋణాలు వున్నాయనుకున్నా, చిన్నా, సన్నకారు రైతులూ, పెద్ద రైతులూ అందరి కమతాలూ లెఖ్ఖలోకి తీసుకుంటే సగటున రెండు నించి మూడు హెక్టార్లు వుంటాయి. అంటే మొత్తం రెండువందల ఋణాలకీ కలిపి వెయ్యి యెకరాల నించి 1500 యెకరాల మధ్య వుంటాయనుకుంటే, ఆ శాఖ వ్యవసాయాధికారి అంత భూమిని, అన్ని వూళ్ళలో చుట్టివచ్చి, 'నిర్థారణలు ' చేసుకున్న తరవాతే అప్పు ఇవ్వాలంటే, జరిగే పనేనా?
మరి రెవెన్యూ వాళ్ళు సర్టిఫికెట్లూ, అడంగళ్ళూ అవీ జారీ చెయ్యడం యెందుకు?
'పృష్టతాడనాత్ దంత భఙ్గః' అంటే ఇదేనేమో!