Friday, January 15, 2010

నాలుగో జమీ


వాక్ స్వాతంత్ర్యం


ఈ మధ్య మీడియాలో వినిపించిన మాటలు 'ఎక్సైల్డ్'; 'రిలయన్స్ '; 'ద్రౌపది ' 'స్వయం నియంత్రణ' ఇలా చాలా!  


అమెరికా రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి సవరణ ద్వారా వాక్ స్వాతంత్ర్యం ప్రకటించబడి, 'నాలుగో జమీ' (ఫోర్త్ ఎస్టేట్ ని తెలుగులో ఇలా అంటే బాగుంటుందని వాడాను) వాడుకలోకి వచ్చింది అంటారు.  


ఏ ప్రభుత్వానికైనా మూల స్థంభాలైన--చట్ట వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తరవాత--నాలుగో స్థంభం గా దీన్ని గుర్తించారు ప్రపంచ వ్యాప్తంగా.  


మరి యే ప్రభుత్వమైనా ఈ వాక్ స్వాతంత్ర్యాన్ని పరిహరించదలుచుకుంటే? ప్రజలందరూ తిరగబడాలి--దాన్ని కాపాడుకోవాలి!  


మరి ఈ రాజకీయులు--'నియంత్రణ వుండాలి; ఆంక్షలు విధించాలి'అని యెందుకు అరుస్తున్నట్టు? ఒకసారి ఆంక్షలు అంటూ మొదలైతే, యెప్పటికైనా దాన్ని పూర్తిగా హరించకపోతామా, అప్పుడు మనమేమి చేసినా చెల్లుతుంది--అని వీళ్ళ ఆశ.  


తస్లీమా వ్రాసిన 'లజ్జ' లో యేమి వుందో అని ఆసక్తిగా కొని చదివాను--అది నవలా కాదు, కథా కాదు, వ్యాసం కాదు--మరేదో! అందులో బంగ్లాదేశ్ లో 'ఫలానా రోజు ఫలానా వూళ్ళలో ఇన్ని హిందూ ఆలయాల్ని ధ్వంసం చేశారు, ఇంతమంది హిందువులు చనిపోయారు' అంటూ యేకరువు పెట్టింది--అందుకే ఆ ప్రభుత్వానికి అది నచ్చలేదు--ఫత్వా జారీ అయ్యింది!  


ఇక అందుకే, సల్మాన్ రష్డీ తన శాటానిక్ వెర్సెస్ లో యేమి వ్రాశాడొ చదవలేదు నేను!  


మళ్ళీ డా విన్సీ కోడ్ కొనకపోయినా, మా అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు కనపడితే, చదివాను--డా విన్సీ బొమ్మని చక్కగా 'ఇంటర్ప్రెట్' చేసి, చక్కని నవల వ్రాశాడు--అవన్నీ నిజాలే అనిపించేంతగా! 


తమకి చేతనైతే ఆ విషయాలూ, ఇచ్చిన ఉదాహరణలూ తప్పని నిరూపించాలిగానీ, దాన్ని యెవరూ చదవడానికి వీల్లేదు అంటే?  


ఇక ద్రౌపది లో ఆయనేమి వ్రాశాడో, ముందుమాటలోనే చెప్పాడట! ఇష్టం వుంటే చదవండి, లేకపోతే లేదు--ఇంత రాధ్ధాంతం యెందుకు?  


ఇక టీవీ విషయానికొస్తే, వాళ్ళకి యే విషయాన్నైనా, యెప్పుడైనా చూపించే హక్కు వుంది, వుండాలి! చూస్తారోలేదో, చూపిస్తారోలేదో, మీ యిష్టం!  


ఎక్సైలెడ్ బ్లాగో, వెబ్ సైటో తెలియదు గానీ, వాడేదో యెప్పుడో వ్రాశాడట--దాన్ని తమ యిష్టం వచ్చినప్పుడు ఫలానా ఫలానా చానెళ్ళు చూపించాయట!  


చూసినవాళ్ళో, అది ప్లాన్ చేసినవాళ్ళో విధ్వంసం మొదలెడితే, అది టీవీవాళ్ళదీ, ఆ విలేఖరులదీనా ఆ తప్పు?  


పోలీసుల్నీ, కోర్టులనీ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు ఈ రాజకీయులు!  


ప్రతీ టీవీకీ 'చానెల్ లాక్'; చైల్డ్ లాక్' ఇలాంటివి వున్నాయి! మరి యెవరు యేమి చూడాలి, చూడకూడదు అనే విషయం ప్రభుత్వాలకి యెందుకు?  


ఈ విషయం లో గొల్లపూడివారు దాదాపు 20 యేళ్ళ క్రితమే యేమి వ్రాశారో చదివారా? లేకపోతే చదవండి--


http://gollapoodi.blogspot.com/2009/11/blog-post_25.htmlhttp://gollapoodi.blogspot.com/2009/11/blog-post_25.html


తరవాత, 'సెన్షేషనలిజం' అని ఒక మాటని మీడియాకి అన్వయించడం మొదలెట్టారు!  


ఈ టాపిక్ మీద ప్రపంచ వ్యాప్తం గా అనేక భాషల్లో అనేక నవలలు వచ్చాయి--ఇంగ్లీషులో ఆర్థర్ హెయిలీ 'ది ఈవెనింగ్ న్యూస్' చదవండి చాలు!  


'బేసిక్' గా, 'ఫండమెంటల్'గా ప్రింటు గానీ, ఎలెక్ట్రానిక్ గానీ, యే మీడియా అయినా ఫక్తు 'వ్యాపార సంస్థలు!' 


మరి అవి తమ చదువరులనీ, ప్రేక్షకుల్నీ సంఖ్య పెంచుకోడానికి యే పంథా అనుసరించినా, వాళ్ళిష్టం--మనం వద్దన్నా మానతారా? నష్టాలని చవిచూసి యెత్తేస్తారా? అలా యెత్తేస్తే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలేమయిపోతాయి?  


ఇవన్నీ నిజాలు--ఈ రాజకీయులు మాట్లాడేవే--పచ్చి అబధ్ధాలు!  


యే ప్రభుత్వమూ, యెవరి వాక్ స్వాతంత్ర్యాన్నీ నియంత్రించడానికి ప్రయత్నాలు చెయ్యడానికి వీల్లేదు! 


అదంతే!


ఇంకొక చిన్నమాట!  


"నీ చేతికఱ్ఱని నీ యిష్టం వచ్చినట్టు వూపుకునే హక్కు నీకుంది--అది యెదటివాడి ముక్కుకి తగలనంతవరకూ!"  


(అంటే ముక్కుకితప్ప ఇంకెక్కడ తగిలినా ఫరవాలేదు అనా?)  


ఆలోచించండి!

Thursday, January 7, 2010

బ్యూరాక్రసీ




మందమైన చర్మం


మనదేశం లో అతి మందమైన చర్మం గల ఆర్గనైజేషన్ లు యేవి అని అడిగితే, మీకు గుర్తొచ్చేవి యేమిటి?  


నాకు మాత్రం మొట్టమొదట గుర్తొచ్చేది 'జీవన్ బీమా నిగం' అనే ఎల్ ఐ సీ, తరవాత--మన బీ ఎస్ ఎన్ ఎల్!  


యెందుకంటారా?  


మళ్ళీ వ్రాస్తాను.