మరో 85,000 కోట్లు!
మొన్న శుక్రవారం కాకుండా అంతకు ముందు శుక్రవారం అనుకుంటా—అదే సెన్సెక్స్ పడిపోయినప్పుడు—రెండ్రోజుల్లో సిమెంటు, ఉక్కు ధరలు సగానికి సగం పడిపోయాయట!
అలా పడిపోతే, సామాన్యుడికి మేలు జరగడం అటుంచి, ఆ కంపెనీలకి లాభాలు తగ్గిపోవడం లేదూ? (గమనించండి సరిగ్గా—నష్టాలు రావడంలేదు….లాభాలు ‘తగ్గి’ పోతున్నాయి!)
మళ్ళీ నిన్న, రిజర్వు బ్యాంక్ రెపో రేటుని తగ్గించీ, ఎస్.ఎల్.ఆర్ ని తగ్గించీ, మరో 85,000 కోట్లు ఆర్ధిక వ్యవస్థ లోకి వదులుతోంది!
వెంటనే మీడియా లో ‘గత కొన్ని రోజులుగా వడ్డీల భారంతో సతమతమౌతున్న సామాన్యుడికి గొప్ప ఉపశమనం’ అంటూ కధనాలు!
క్రితం సారి సీఆరార్ పెంచగానే, బ్యాంకులు తమ పీఎల్లార్ పెంచుకుంటే, విత్త మంత్రిగారు ఏమి చెప్పారు? ‘మీరెంతైనా పెంచుకోండి గానీ, 35,00,000/- పైబడిన గృహ, విద్యా ఋణాలకే పెంచుకోండి’ అని!
సరే, బ్యాంకులూ వెంటనే తలూపాయి.
అసలు 34,00,000/- గృహ/విద్యా ఋణాలు తీసుకునే ఆ తలకు మాసిన సామాన్యుడెవడండీ?
సామాన్యుడెవడైనా, అప్పు కావాలంటే, ముందు గుర్తొచ్చేది బంగారం. ఆ తరవాత తన జీతం! బ్యాంకు కి వెళ్ళి, బంగారం తాకట్టు పెట్టుకొనో, లేదా ‘నా జీతంలో నెల నెలా తెగ్గోసుకుందురుగాని’ అనో అప్పుకి ప్రాధేయపడతాడు తప్ప, అవసరం వెయ్యో పదివేలో అయితే, ‘ఇల్లు కట్టుకుంటాను—ఓ ముప్ఫై లక్షలివ్వండి’ అనో, ‘చదువుకుంటాను—ఓ పాతిక లక్షలివ్వండి’ అనో కాదుగా?
మరి ఈ లక్షల కోట్ల విదుదల తో సామాన్యుడికి ఒరుగుతున్నదేమిటి?
సరిగ్గా యేడాది క్రితం కిలో 16 రూపాయలున్న సోనా మసూరి బియ్యం, ఏ రోజు 27 నించి 30 రూపాయలా? పైగా ‘వారంలో ద్రవ్యోల్బణం రేటు 0.1 శాతం తగ్గింది! ఇక ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అని చంకలు గుద్దుకోవడమా!
ఇదేం వ్యవస్థ?
బ్యాంకులని ‘వడ్డీ రేట్లు తగ్గిస్తారా?’ అని మీడియా ప్రశ్నలు!
వాటి సమధానం “వచ్చే వారంలో మా ‘ఆల్కో’ సమావేశం తరవాత నిర్ణయం తీసుకుంటాము” అని.
ఈ ‘ఆల్కో’ అంటే, ‘ఎస్సెట్ లయబిలిటీ మేనేజ్ మెంట్ కమిటీ’ అని ప్రతీ బ్యాంకూ శ్రీ నరసిం హం కమిటీ తరవాత యేర్పాటు చేసుకున్నాయి! ఇదంతా ఓ పెద్ద ఫార్సు!
ఈ ఆల్కోలు చెప్పేవాటిని బ్యాంకు సీయండీలే తీసి పారేస్తారు!
యెందుకంటే, ప్రపంచంలో ఎప్పుడు ఏ మనిషికి ఏ క్షణంలో, యెంత ‘డబ్బు’ అవసరం అవుతుందో ఆ బ్రహ్మ దేవుడు కూడా చెప్పలేడు కాబట్టి!