Friday, February 27, 2009

వృద్ధి

మన బ్యాంకులు దివాళా యెత్తకుండా మన పెద్దలు తీసుకున్న జాగ్రత్తల్లో కొన్ని—సీ ఆర్ ఆర్, ఎస్ ఎల్ ఆర్, బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్—ఇలాంటివి

వీటిగురించి స్థూలం గా చెప్పుకొంటే—

ముఖ్యంగా బ్యాంకులు ప్రజల దగ్గరనించి డిపాజిట్ల రూపం లో సేకరించిన నిధుల్లో, ఖచ్చితంగా ఇంత శాతం అని, ‘నగదు రూపం లో’ రిజర్వ్ బ్యాంకు దగ్గర వుంచాలి. దీన్ని కేష్ రిజర్వ్ రేషియో (సీ ఆర్ ఆర్) అంటారు.

తరవాత, యెప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకోవడానికి వీలుగా, ఇంకొంత శాతం సెక్యూరిటీల రూపం లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిలవ వుంచాలి. దీన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ ఎల్ ఆర్) అంటారు.

బ్యాంక్ రేట్ ఇప్పుడు అమల్లో లేదు అనుకున్నాం కదా.

ఇక రిపోజిటరీ అనేదొకటి స్థాపించింది మన రిజర్వ్ బ్యాంక్.

బ్యాంకుల దగ్గర ఎస్ ఎల్ ఆర్ కి కావలసిన దానికన్నా యెక్కువ సెక్యూరిటీలు వుంటే, వాటిని రిపోజిటరీ లో దాఖలు చేసి, నగదు అప్పు తీసుకోవచ్చు. దానికి కొంత వడ్డీ వసూలు చేస్తుంది రిజర్వ్ బ్యాంక్. అదే రెపో రేట్.

సెక్యూరిటిలు తక్కువైతే, నగదు చెల్లించి, సెక్యూరిటీలని అప్పుగా పొందవచ్చు. దీనికీ కొంత వడ్డీ వసూలు చేస్తుంది ఆర్ బీ ఐ. అదే రివర్స్ రెపో రేట్.

సీ ఆర్ ఆర్ నీ, ఎస్ ఎల్ ఆర్ నీ నిలబెట్టుకోడానికి రెపోజిటరీ వెసులుబాటు కల్పిస్తుందన్న మాట.

ఈ రేట్లు తగ్గించడం ద్వారా ఆర్ బీ ఐ కొన్ని వేల కోట్ల నగదు ని బ్యాంకుల కి ఋణాలివ్వడానికి వీలుగా అందుబాటులో వుంచుతోంది!

దాని వల్లే ఋణాల మీద వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ప్రజల డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గి పోయాయి!
మరి కృత్రిమంగా ఇలా వుంచడం అవసరమా?

ద్రవ్యోల్బణం బాగానే తగ్గింది. కానీ ఈ యెన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది ‘వృద్ధి రేటు’ గురించి! అంచనాలు యెనిమిదికీ, యేడుకీ తగ్గి, ఇంకా తగ్గేలా వున్నాయి మరి!

ఈ సందర్భంలో నిన్న యూ ఎస్ అధ్యక్షుడు ఒబామా వాళ్ళ చట్ట సభలో చేసిన ప్రసంగానికి ప్రతిగా, ప్రతిపక్ష హోదాలో శ్రీ బాబీ జిందాల్ ప్రసంగం లోంచి ఈ మాటల్ని గమనించండి.

“మనదగ్గర లేని డబ్బుతో, మనకు అవసరం లేని వస్తువులను కొనడానికి ఋణాలెందుకు తీసుకోవాలి?”

వజ్ర సమానమైన, వజ్ర సదృశం అయిన, వజ్రోపమానమైన—ఇలాంటి విశేషణాలెన్నో వెయ్యదగ్గ మాటలు కావూ ఇవి?

మన ప్రధాన, మాజీవిత్త, తాత్కాలిక విత్త మంత్రులు గమనిస్తున్నారా?

Monday, February 16, 2009

ఆర్ధిక మాంద్యం

ఆర్ధిక మాంద్యం


……పుణ్యమాని, ఓ కంపెనీ అధిపతి శుబ్భరంగా దొంగతనాలు చేసేస్తున్నాడుట!
ఏకంగా ఓ బ్యాంకుకి కన్నం వేస్తూ పట్టుబడ్డాడట! (ఈనాడు 16-02-2009 పేజి నెం.5)

ఫ్రీ సర్వీస్!


ఇంకో ఆర్ధిక మాంద్యానికి సంబంధించిన వార్త—పరిస్థితుల వల్ల ఉద్యోగాలు ఊడిపోయిన మహిళలకి యేకంగా ఇంటర్నెట్ లో ప్రకటనలిస్తున్నారట—నాతో సెక్స్ కి అభ్యంతరం లేక పోతే, అద్దె లేకుండా మా ఇంట్లో మీరు వుండవచ్చు—అని!
బాగుందా?

Sunday, February 1, 2009

మూడేం ఖర్మ? మూడొందల తొంభయ్యారు!


తాజాగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకి పాకేజ్ ఇస్తానంటాడు మన ప్రధాన/ఆర్ధిక మంత్రి. రిజర్వ్ బ్యాంక్ గవర్నరు! (వెనకాల హోం మంత్రి ప్రోద్బలం చాలా వున్నట్టుంది!)

(ఈ అరవ్వాళ్ళేకదా గోవిందా ఎంటర్ ప్రైజెస్ లాంటివి స్థాపించి మన తెలుగోళ్ళ నెత్తిన చెంగేసింది? ఈ రోజుక్కూడా, 'మళ్ళప్పురం ఫైనాన్స్ 'లాంటి పేర్లతో 'మీ బంగారం తనఖాపై నూటికి నూరు శాతం ఫైనాన్స్ ' అని ప్రకటనలిస్తున్నది? రేప్పొద్దున్న, బంగారం రేటు పెరిగిన తర్వాత, వాళ్ళు మాయం అయిపోతే, మన బంగారానికి దిక్కెవరు?)

మన ఆర్ధిక వ్యవస్థ కి పట్టిన గ్రహణం—ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ, తామరతంపరగా వెలసిన ‘మైక్రో ఫైనాన్స్ ‘ కంపెనీలూ! ఇంకా, మ్యూచువల్ (వెఱ్ఱి వెఱ్ఱి) ఫండ్సూ!

వీటికి తోడు, బ్యాంకులూ! మహిళా సంఘాలకి లక్షలు లక్షలు అప్పులు ఇచ్చేస్తున్నాయి!
‘మన మహిళలందరూ లక్షాధికారులు కావాలి—పావలా వడ్డీ తో’ అనే మన ముఖ్య మంత్రీ!

మొన్నొకరోజు, పొద్దున్నే మా యింటిదగ్గరున్న కిరాణా కొట్టుకి వెళితే, దగ్గర్లో వున్న గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అడుక్కొనే చింపిరిజుట్టు మహిళ, చంకలో యేడాది బిడ్డతో, జాకెట్లోంచి ఓ మురికిపట్టిన నలిగిన పదిరూపాయల నోటు తీసి ఇచ్చి ‘ఓ క్లినిక్ ఆల్ క్లియర్ డబ్బా ఇవ్వండి’ అంది దుకాణదారుని!

ఆసక్తి చంపుకోలేక అడిగాను, ‘అమ్మా! నీకు చింపిరి జుట్టు లేకపోతే, యెవరు ముష్టి వేస్తారు?’ అని!

నన్ను గుర్తించినట్టుంది—“బాబుగారూ! మీరా! ఇవాళా, రేపు నాకు సెలవిచ్చేశారండి! (సంఘం వాళ్ళు) చక్కగా తయారయి, మా ఆయనా, పిల్లలతో, సినిమాకి వెళ్ళి, హోటల్లో భోజనంచేసి, ఇంటికి వెళ్తానండి! మీకు తెలియందేముందండి బాబుగారూ! చింపిరి జుట్టంటారా? యెంతసేపొస్తుంది—జుట్టు విప్పి రోడ్డు మీద రెండు సార్లు పొర్లాడితే!”

భారత దేశం బీదది అనే దమ్ము యెవరికుంది?

"స్లం డాగ్ మిలియనీర్" కి ఇన్ని అవార్డ్ లు యెందుకు వస్తున్నాయి? (అరిందం చౌదరి సరిగ్గా తన అక్కసు వెళ్ళగక్కలేకపోతున్నాడు!)

Saturday, January 31, 2009

మూడు కుంభకోణాలు

మరో మూడు సత్యాలు……!

ఘోరమైన నిజాలు బయట పడుతున్నాయి!

మరో మూడు కంపెనీలు—రియల్ ఎస్టేట్ రంగంలోవి—పేపర్లలో ఇవాళ (31-03-2009) వచ్చింది.
“డీ ఎల్ ఎఫ్”; “శోభా డెవలపర్స్”; “యూనిటెక్” ల గురించి!

1. డీ ఎల్ ఎఫ్: దీనికి 245 అనుబంధ సంస్థలూ, 12 భాగస్వామ్య సంస్థలూ, 12 సం యుక్త సంస్థలూ, ప్రమోటర్ల నియంత్రణలో మరో 124 సంస్థలూ ఉన్నయట!

2. శోభ డెవలపర్స్: ఈ యాజమాన్య ప్రముఖుల అధీనంలో 47 సంస్థలు ఉన్నాయట! 3. యూనిటెక్: యూనిటెక్ కార్పొరేట్ పార్క్స్ అనే లిస్టెడ్ కంపెనీ, యూనిటెక్ వైర్లెస్ అనే నమోదుకాని కంపెనీ, 316 అనుబంధ సంస్థలూ, 21 సం యుక్త సంస్థలూ,

ఈ కంపెనీ, స్థిరాస్థి వ్యాపారానికి నిధులు అవసరం అయినప్పుడు యేమాత్రం సంబంధం లేని టెలికాం వ్యాపారం లో పెట్టుబడులు పెట్టిందట!

వీళ్ళ గురించేనా—‘రియల్ ఎస్టేట్ రంగంలో మాంద్యం’; ‘సామాన్యుల నడ్డి విరుస్తున్న వడ్డీ రేట్లు’ ‘వడ్డీల తగ్గుదలతో సామాన్యుడికి కాస్త ఉపశమనం’ లాంటి శీర్షికలతో శ్రీ తుమ్మల కిషోర్ లాంటి కాలమిష్టులు బాధనీ, సంతోషాన్నీ వెలిబుచ్చింది?

ఒకరే రెండు మూడు కంపెనీలని అంతకన్నా యెక్కువ కంపెనీలని స్థాపించి, ఒకదాని నించి ఇంకోదానికి డబ్బు బదిలీ చేస్తూ, ఆటాడుకోవడాన్ని—మనీ లాండరింగ్ అంటారు!

9/11 తరవాత, మన భారత ప్రభుత్వం—అంతర్జాతీయ పరిశోధన ఫలితంగా, ఆ టెర్రరిష్టులకి ఇండియా నించి కూడా నిధులు అందాయి అని నిర్ధారణ అయినప్పుడు, పీ ఎం ఎల్—ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఎండ్ కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం……అనే ఒక చట్టాన్ని చేసి, బ్యాంకులకి ‘యెవరైనా యేఖాతాలోనైనా, 10 లక్షలకు పైబడి లావాదేవీలు చేస్తే, వెంటనే వాళ్ళ పేర్లూ, అడ్రెస్ లూ, పాన్ నెంబర్లూ వగైరా రిజర్వు బ్యాంకుకి తెలియజెయ్యాలి’ అని అజ్ఞాపించి, ఇప్పటిదాకా జరిపించుకుంటోంది!

మరి ఆ రిపొర్టులు అన్నీ యేమైపోతున్నట్టు? మన రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్; సెబీ—ఇలాంటివన్నీ యేం చేస్తున్నట్టు?
అదే మన బ్యూరాక్రసీ!

ఆయనే వుంటే మంగలాడెందుకు?

Monday, January 26, 2009

మరో కుంభకోణం

“సత్యం—రామలింగ రాజం”


‘ఆడిటర్లు’; ‘ఫైనాన్షియల్ ఎనలిష్టులు’; ‘సెబి’; ‘విత్త మంత్రి’; ‘కార్పొరేట్ వ్యవహారాల మంత్రి’; రాష్ట్ర ముఖ్య మంత్రి’—వీళ్ళ మధ్య సంబంధాల గురించి నేను బ్లాగ్ సిద్ధం చేస్తూండగానే, నా సిస్టం లో సమస్య వచ్చి, ఇన్నాళ్ళూ వ్రాయలేక పోయాను.

ఈ మధ్య లోనే మరో కుంభకోణం బ్రద్దలయింది!

వివరాలు అందరికీ తెలిసినవే!

మహా ఘనుడు, తెలుగు తేజం, ‘ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకే’ అని గర్వంగా చాటిన మన మాజీ ప్రథాని శ్రీ పీ. వీ. నరసిం హా రావు—ఆర్థిక సంస్కరణలని దేశంలో ప్రవేశ పెట్టక ముందు—కథ వేరుగా వుండేది!

బ్యాంకులు ఋణ మంజూరు పై నిషేధం విధించి, దాన్ని పొడిగిస్తూ, కొనసాగిస్తూ వుండేవి! (దీనికి కర్ణుడి చావులా—‘పూజారీ మేలాలూ’ ‘ఋణ మాఫీలూ’, ‘అస్థ వ్యస్థ ఋణ మంజూరీలు’—ఇలా అనేక కారణాలు!)

జాగ్రత్త చర్యలుగా ముందు ‘టాండన్ కమిటీ’ సిఫార్సులనీ, తరవాత ‘చోరే కమిటీ’ సిఫార్సుల్నీ అమలు చేశారు!
వీటి ముఖ్య లక్షణం యేమిటి అంటే, ఒక ‘యూనిట్’ కి ‘యెంతవరకూ ఒక బ్యాంకు ఋణం మంజూరు చెయ్యవచ్చు’ అనే దానికి రకరకాల వివరాలూ, వివరణలు అడిగి, వాటిని అనేక రకాలుగా విశ్లేషించి, ‘మాగ్జిమం పెర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్’—‘ఎం. పీ. బి. ఎఫ్' అనే బ్రహ్మ పదార్ధాన్ని తయరు చేసి, ఏ పద్ధతిలో దీన్ని నిర్ణయించాలీ? అని ముందు నిర్ణయించి, అప్పుదు ఋణ మంజూరి జరిగేది.

సరిగ్గా ఈ విషయంలోనే, ‘చార్తర్డ్ ఎకౌంటెంట్’ ల, ఆడిటర్ల పంట పండింది!

మరి యూనిట్ కి యెంత ఋణం కావాలో చెపితే, దానికి తగ్గట్టు వాళ్ళ ‘ఫైనాన్షియల్ స్టేట్ మెంట్' లు దగ్గరనించీ, చెయ్యబోయే వ్యాపారంగురించీ, రాబోయే లాభాల గురించీ, దాంట్లో బ్యాంకుకి తీర్చబోయే బాకీలని తారీఖుల ప్రకారం యెంత ఖచ్చితంగా తీరుస్తారో, తీర్చగలరో—ఇలాంటి వివరాలన్నీ తయారు చెయ్యద్దూ?

సరే, తయారు చేసి, బ్యాంకుకి సమర్పించారనుకోండి, మరి వాటిలో మతలబులన్నీ సామాన్య బ్యాంకు ఉద్యోగులకి తెలియవు! కాబట్టి, బ్యాంకులు ‘ఫైనాన్షియల్ ఎనలిష్టులు’ అనే కొత్త పోస్టులని సృష్టించి, వాటిలో మల్లీ ‘చార్టర్డ్ ఎకౌంటెంట్’ లని నియమించడం ప్రారంభించేయి!

ఋణ మంజూరు అధికారికి ప్రతిపాదనలు పంపి, నెలల తరబడి వేచి చూసినా, ఎదో వంకతో ‘కొర్రీ’ల మీద ‘కొర్రీ’లు వేసేవారు!

“శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు” అన్నట్టు, సరిగ్గా అక్కడే యూనిట్ తరఫు ఆడిటర్లకి బ్యాంకు ఎనలిష్టులకీ అపసవ్య సంబంధాలు యేర్పడడం మొదలయ్యింది! కుంభాకోణాలకి బీజం పడింది! ‘యెలా అయితే మంజూరు అవుతుందో చెప్పెయ్యరాదా?’ అని వీళ్ళు అడగడం, ‘మేము చెప్పకూడదు గానీ, ఫలానా ఫలాన వాటిలో పొరపాట్లు వున్నాయి అని మాత్రం చెప్పగలం’ అని వీళ్ళు చెప్పడం మొదలయింది!

పోగా పోగా, కాగితాల మీద పరిస్థితి అంతా తేట తెల్లంగా వుండేదిగాని, బ్యాంకుల ఋణాలు వసూలు కాక పోయినా, ఋణ ఖాతాకి ఖర్చు వ్రాయగానే వడ్డీలని బ్యాంకు లాభాల ఖాతాలలొ చూపించడం, ప్రతీ సంవత్సరం బ్యాంకుల లాభాల్లో ఖచ్చితంగా వృద్ధి కనిపించడం జరిగేది!

తరవాత ‘నరసిం హం కమిటీ’ ముందుజాగ్రత్త నిబంధనలు (ప్రూడెన్షియల్ నార్మ్ స్) విధింపుకి సిఫార్సు చేసి, ప్రభుత్వం అమలు చెయ్యమనగానే, బ్యాంకుల బండారం బయటపడింది. ఆస్థులు (బ్యాంకులిచ్చిన అప్పులు) పారు బాకీలైనా, అలాగే పెరుగుతూ వుండడం వల్ల, వాటిని మినహాయిస్తే, పెట్టుబడులు నశించి, బ్యాలెన్స్ షీట్లు చిక్కిపోయాయి!

బ్యాంకులన్నిటికీ మళ్ళీ ప్రభుత్వమే నిధులు సరఫరా చెయ్య వలసి వచ్చింది (ప్రజలు కట్టే పన్నుల్లోంచి)!

మరి పైన చెప్పిన వాళ్ళ మధ్య సంబంధం లేదంటారా? అదే ఆడిటర్లూ, అధికార్లూ, మంత్రులూ, సెబి లాంటి వ్యవస్థలూ ఇప్పుడుకూడా యేదో రూపం లో వున్నాయి కదా—మరి మార్గం యేమిటి?

Saturday, December 27, 2008

ద్రవ్యోల్బణం

తగ్గుతున్న ద్రవ్యోల్బణం


ద్రవ్యోల్బణ రేటు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తోంది ఇప్పటికి.
కానీ, ఈ తగ్గుదల రేటు నిత్యావసరాల లో మాత్రం, ఇంకా పెరుగుతూనేవుంది!

ఆగస్ట్ 2 తరవాత, ఈ అయిదు నెలలో, ఇళ్ళు కట్టేద్దామనుకొని, ద్రవ్యోల్బణం కారణంగా మానేసి, మాంద్యం వల్ల సిమెంటూ, స్టీలూ ధరలు తగ్గగానే వెంటనే ఇళ్ళు కట్టడం మొదలు పెట్టిన వాళ్ళు, వడ్డీ రేట్లు తక్కువ స్కీములో గృహ ఋణంకోసం బ్యాంకులకి పరిగెట్టినవారు, యెంతమందంటారు?

నేను కాలమిస్టులని విమర్శించిన తరవాత, పెరిగిన వడ్డీల బాధితులని చూపించగలరా అని విసిరిన సవాలుకి జవాబేమో, ఈనాడు రెండు రోజులుగా ‘వడ్డీల పెరుగుదల బాధితుల్లో మీరూ వున్నారా? అయితే వివరాలు పంపండి’ అంటోంది!

1985 లో సోనా మసూరి పాత బియ్యం కేజీ ధర రూ.3-60 పైసలు! ఇప్పటికి యెన్ని రెట్లు పెరిగిందంటారు? పోనీ అన్నదాతకేమైనా ఒరుగుతోందా? దీనిక్కారణం ప్రభుత్వ తప్పుడు విధానాలు కాదూ?

ఇప్పుడు ముడి చమురు లీటరు రూ.10/- లోపే వున్నా, పెట్రో ధరల తగ్గింపు యెన్నికల ముందుదాకా వుండదుట! చూశారా?

అదండీ సంగతి!

Sunday, November 9, 2008

వడ్డీ రేట్లు

పీ. యల్. ఆర్.

బ్యాంకురేటు యెత్తెయ్యగానే, బ్యాంకులకి యేం చెయ్యాలో పాలుపోలేదు. అందుకని ‘ప్రైం లెండింగ్ రేటు ' అని ప్రవేశ పెట్టాయి!

ఇదో విచిత్రమైన ప్రక్రియ!

ఎందుకంటే, ఇది శంఖంలో పోసిన తీర్థం కాదు! ప్రతీ బ్యాంక్, తన ఇష్టం వచ్చినట్టు దీన్ని పెట్టుకో వచ్చు!
సరే. అప్పు తీసుకునే వాళ్ళ దగ్గర వ్రాయించుకునే ప్రామిసరీ నోట్ల మీద ఇదివరకు—“రిజర్వ్ బ్యాంకు రేటు మీద ‘ఇంత’ శాతం యెక్కువ లేదా తక్కువ వడ్డీ తో ఈ అప్పు తిరిగి చెల్లిస్తాను” అని వ్రాయిoచుకునేవారు.

ఈ ప్రోనోట్లలో, ‘రిజర్వ్ బ్యంక్ రేటు’ అనే మాట స్థానంలో, పీ. యల్. ఆర్. ని చొప్పించాయి! (జడ్జీలకి కాస్త బ్యాంకింగ్ అవగాహన వుంటే, బ్యాంకులని దీని ఆధారంగా ముప్పు తిప్పలు పెట్టచ్చు!—నేనింకా సర్వీసులో వుండడంవల్ల ఇంతకన్నా యెక్కువ వివరణ ఇవ్వలేను)

ఇక పీ. యల్. ఆర్. తో ప్రారంభమయ్యాయి కష్టాలు!

ఇది ఇప్పటికి యెన్ని అవతారాలు యెత్తిందంటే, నేను చెప్పలేను….ఒక్కో బ్యాంకు ఒక్కోలాగ, ‘ప్రైమరీ’ ‘సెకండరీ’ ‘స్టాండర్డ్’ ‘షార్ట్ టెర్మ్’ ‘లాంగ్ టెర్మ్’ ‘మిడిల్ టెర్మ్’—ఇలా!

చివరికి, ప్రజలకీ, మీడియాకి చెప్పడానికి—‘బెంచ్ మార్క్ పీ. యల్. ఆర్’ని కనిపెట్టాయి!

(మీరు గమనిస్తే, మీరు వ్రాస్తున్న ప్రోనోట్ మీద ‘……% ఏబవ్/బిలో ది బీఎంపీఎల్లార్/ఎస్టీపీఎల్లార్/ఎల్టీపీఎల్లార్…….’ ఇలా ప్రింటు చెయ్యబడి వుంటుంది—అనవసరమైనవాటిని కొట్టేసి, అవసరమైనదానినే వుంచుకునేలాగ.)

ఇప్పుడు బెంచ్ మార్క్ పీయల్లార్నే, అప్పుడప్పుడూ, అర శాతమో పావు శాతమో, పెంచడమో, తగ్గించడమో చేస్తున్నాయి—చిదంబరంగారు చెప్పగానే!

దీనివల్ల యెవరికేమి వొరిగింది? ఈ రేటు తగ్గితే, అది ఎఫెక్ట్ చేసిన రోజునించీ ఋణాలు తీసుకునే వారికే వర్తిస్తుంది!—ఫిక్సెడ్ రేటు తీసుకున్నవాళ్ళకెవరికీ వర్తించదు.

ఇక ‘ఫ్లోటింగ్’ రేటు తీసుకున్నవాళ్ళకి, ఇదివరకు 7-8 శాతం వడ్డీ కి తీసుకున్నవాళ్ళూ, ఫ్లోటింగులో ఇప్పటికి 14 శాతానికి చేరారుకదా, వాళ్ళకి ఓ అరో, పావో శాతం తగ్గితే వచ్చే ఉపశమనం యెంత?

అదండీ సంగతి!